పుట:MaharshulaCharitraluVol6.djvu/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

87


ఎట్టకేలకు, తాను దేవగురువు కాఁదలఁచియు దేవతలు తన్నుఁగాక బృహస్పతిని గురువుగా వరించియున్న కోపముకతమున, ఉశనసుఁడు రాక్షస లోకగురువుగా నుండ నంగీకరించెను. నాఁటినుండి యాతఁడు శుక్రాచార్యుఁ డని యెల్లరచేఁ బిలువఁ బడుచుండెను. అసలుపేరు మూలఁబడి యీపేరే ఆతనికి శాశ్వత మయ్యెను.

శుక్రుఁడు అసురులను శపించుట

శుక్రాచార్యుని గురుత్వమహత్త్వమున హిరణ్యకశిపుఁడు డెబ్బదిరెండు నియుతంబుల రెం డర్బుదంబుల యెనుబదివేల సంవత్సరములు (726160000) మూఁడులోకములను ఏకచ్ఛత్రాధిపతియై తన్నుఁ గాదనఁ గలుగుమగవాఁడు లేక పరిపాలించెమ.

తరువాతఁ జిరకాలమునకు రాక్షసులను విడిచి యజ్ఞపురుషుఁడు దేవతలకడకుఁ బోయెను. నాఁటినుండి దేవతలకు విజయము, శుభము, సౌఖ్యము పరంపరలుగాఁ గలుగుచుండెను. రాక్షసులకు పరాజయము, అశుభము, ఆసౌఖ్యము అవిచ్చిన్నముగాఁ గలుగుచువచ్చెను. మూఁడులోకములందును పరాజయ మందిన రాక్షసులు తమకులగురు వగు శుక్రాచార్యునిఁ జేరి తమకష్టనష్టములు తెలుపుకొని రక్షింపఁ బ్రార్థించిరి. శుక్రాచార్యుఁడు వారి కభయమిచ్చి శౌరిసాయమున దేవతలు జయించు చుండి రనియుఁ దాను శిపునిసాయము సంపాదించి యాతనివరముల మహత్త్వమున రాక్షసులు మరల మూఁడులోకములు నేలునట్లు చేయఁ గలనని శపథముచేసి వారిని పంపివేసెను. వెంటనే తనమాటప్రకారము శుక్రుఁడు కైలాసపర్వతమున కేగి పరమశివుని భజించి "దేవదేవా ! దేవతల పరాజయమునకు రాక్షసుల విజయమునకు బృహస్పతి యెఱుంగనిమంత్రరహస్యములను నాకు బోధింపు" మని ప్రార్ధించెను. "భార్గవా! నీవు తలక్రిందులుగ కణధూమపానముచేయుచు వేయిసంవత్సరములు తపస్సుచేసినయెడల నీకోరిక సిద్ధించు" నని చెప్పి పొమ్మనెను.

పరమశివునియనుగ్రహ మట్లు పొంది యాతఁడు చెప్పిన చొప్పున శుక్రాచార్యుఁడు తదేకనిష్ఠాగరిష్ఠుఁడై “కణధూమవ్రత" మమ గొప్ప వ్రతము నవలంబించి తలక్రిందులుగాఁ దపసుచేయ నారంభించెను.