పుట:MaharshulaCharitraluVol6.djvu/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

మహర్షుల చరిత్రలు

వత్సుఁ డాశ్చర్యభయవిహ్వలుఁడై యేమిచేయుట యని డోలాందోళిత మానసుఁడై యుండ వ్యాసమహర్షి విచ్చేసి యందు దోషములేని దని నల్వురను వివాహమాడి సుఖింపుమని యాదేశించి సౌభరిమహర్షి మాంధాతృచక్రవర్తి కూఁతుండ్ర నేఁబదిమందిని వివాహమాడుట, చంద్రుఁ డిరువదియేడ్గురను పెండ్లిచేసికొనుటయు నుదాహరించెను. వత్సుఁ డాతని పాదములకు మ్రొక్కి యానల్వురు కన్యకా మణులను వేదో క్తవిధిని వివాహమాడెను.

అనంతరము మృగశృంగుఁడు నలువురు భార్యలను దీసికొనిపోయి యాశ్రమము నిర్మించుకొని యందు వారితో గార్హస్థ్యధర్మము లాచరించుచు వారితో నిష్టోప భోగము లనుభవించుచుండెను.

మృగశృంగుని సంతానము

ఇట్లు కొంతకాల మగుసరికి మృగశృంగుని కృపవలన గర్భము ధరించి సువృత్త నవమాసములు నిండినపిదప నొక్క పుత్త్రునిం గాంచెను. భూతభవిష్యద్వర్తమానవేది యగు మృగశృంగుఁడు తపోనిష్ఠాగరిష్ఠుఁడై యుండు నా బాలుని దేహంబును మృగములు రాచుకొను ననెడియర్ధము సూచితముగా నాతనికి మృకండుఁ డని నామకరణము చేసెను.

ఇదేవిధముగా మృగశృంగమహర్షి దయవలన కమల విమల, సురస యనుమిగిలినమువ్వురు పత్నులును గర్భములుదాల్చి కాలక్రమమున మువ్వురు సుతులను గాంచిరి. వారిలో కమలకు జనించిన కొమరుఁడు ఉత్తముఁ డనియు, విమలకు జనించిన పుత్రుఁడు సుమతి యనియు, సురసకుఁ గలిగిన కొడుకు సువ్రతుఁడనియు నన్వర్థ నామధేయముల ధరించిరి.

కొంతకాల మైనపిదప యుక్తవయస్సు రాఁగానే మృకండుమౌని ముద్గలమహర్షికూఁతు రగు మరుద్వతిని బెండ్లాడి తపోగృహస్థజీవనము గడప నారంభించెను. ఉత్తముఁడు కణ్వముని పుత్రిక యగుకుశను,