పుట:MaharshulaCharitraluVol6.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగశృంగమహర్షి

77


లక తనమాఘస్నానపుణ్యము నా యేనుఁగుతొండమున ధారవోసెను. వెంటనే ఆ యేనుఁగు తనశరీరమును విడిచి దివ్యశరీరమున నాకాశమున కెగిరి తనపూర్వజన్మవృత్తాంత మాతని కెఱింగించి వెడలిపోయెను.

తనపట్టు విడువక వత్సుఁడు నీటిలోఁ దపము కొనసాగించుచు మృత్యుదేవత నిట్లు ప్రార్థించెను : "ఓసంజ్ఞాతనూభవ ! క్రియాసాక్షి ! ధర్మస్వరూపా ! అధర్మశాస్తా ! వై వస్వత ! కరాళవదన ! ప్రలంబోష్ఠ ! దక్షిణదిఙ్నాథా ! దండధారీ ! మహిషవాహనా ! దీప్తాగ్ని నేత్రా ! సాధు ప్రసన్నా ! అంజనపర్వతసంకాశా! అప్రమేయా ! సంయమనీ పురీశ ! శమనా ! యమునా సహోదరా ! నాకుఁ గన్పట్టుము. " ఇట్లు ప్రార్థింపఁ బ్రార్థింప యముఁడు ప్రత్యక్షమై "వత్సా! నీ తపమునకు మెచ్చితి. నీ కేమి కావలయునో కోరుకొను” మనెను. వత్సుఁడు " దేవా ! చనిపోయిన సువృత్త చెలికత్తెలతోఁ గూడ తిరిగి జీవించునట్లనుగ్రహింపు” మని ప్రార్థించెను. యముఁ డట్లే యగు నని వర మిచ్చి యంతర్హితుఁ డయ్యెను.

వత్సుఁడు వెంటనే బయలుదేఱి సువృత్తాదుల శరీరము లున్న కడకు వచ్చి చేరెను. ఆతఁడు వచ్చుసరికి వారు లేచి కూర్చుండిరి. వారిబంధువు లెల్లరు చనిపోయినవారు తిరిగివచ్చుట వింతలకెల్ల వింత యని యపరిమితానంద మందిరి. అప్పు డాకన్యకలు తాము యమలోకమున కేగి తిరిగి వచ్చుటఁ జెప్పి యమలోకమును సవిస్తరముగ వర్ణించి యెల్లరి కానందాశ్చర్యములఁ గలిగించిరి.

మృగశృంగుని వివాహ వృత్తాంతము

పిదప, ఉతథ్యుఁడు మునీశ్వరుల నెల్లర నాహ్వానించి తనపుత్త్రి యగుసువృత్తను మృగశృంగమౌని కిచ్చి పరిణయము గావించు ప్రయత్నమున నుండఁగా, ఆమె చెలికత్తెలు మువ్వురునువచ్చి “మునీంద్రా ! మేము మువ్వురమును నిన్నే భర్తగా భావించితిమి. మమ్మును నీవు పరిణయమాడ నీకు క్షేమము కలుగును. నీ వందు కంగీకరింపనియెడల మేము ప్రాణత్యాగము చేయుదు” మని మృగశృంగునితో వాక్రుచ్చిరి.