పుట:MaharshulaCharitraluVol6.djvu/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

53


యారణ్య కోద్గీతమైన వాక్యసముదాయమున విష్ణుమూర్తిని యాగభాగమును గాన నాహ్వానించెను. కరుణామయుఁ డగుహరి ఉపరిచరవసువున కొక్కనికే కానవచ్చి యాగభాగమును గొని చనెను. బృహస్పతి తనకుఁ గానరాకుండ హరి పోయె నని దుఃఖించి కన్నీరొలుక వాపోయెను. సదస్యులగు ఋషిసత్తములు రాజు నాతని నూఱడించి హరి యందఱకు లోచనగోచరుఁడు కాఁడనియు, ఐకాంతికభక్తులై యనేక వేలసంవత్సరములు భజించినవారికే యాతఁడు కానఁబడు నని తెలిపిరి. బృహస్పతి యూఱడిల్లి తనశిష్యుని యదృష్టమున కానందించి యా యాగము సువ్రయోగముగా నడపించెను.*[1]

బృహస్పతి యింద్రునికి బోధించిన ధర్మములు

సురాధిపుఁ డగునింద్రుఁడు సురగురు వగు బృహస్పతి నాశ్రయించి సర్వధర్మములు నెఱింగెను. ఆ సందర్భమున “మాట మంచితనమే సమస్త ప్రాణులను సంతోషపెట్టును. దానివలన యశము కలుగును. అది కలవానికి సర్వభూతజాలము సంతోషమున స్వాధీనమగును. చిఱునవ్వు ముఖమునఁ జిందులాడ హితముగను మితముగను మాటలాడ నేర్చినవాని కెల్లరును బ్రసన్ను లగుదురు. మృదు మధుర హితవచనముల నేమి చేసిన నెవ్వనికిని బాధ కలుగదు. మాటమంచి తనమున హింసించినను హింస పొందువాఁడును సంతసించు" నని తెలిపెను.

మఱియొకప్పు డింద్రుఁడు బృహస్పతిని "బ్రాహ్మణోత్తమా! నే నేమి చేసిన, నెట్లు ప్రవర్తించిన జయలక్ష్మీ నన్ను విడనాడదో తెలుపు" మని ప్రార్థించెను. బృహస్పతి యిట్లు పలికెను. "ఇంద్రా! శత్రువుల నై నను గలహముచే నణంవఁ దలంపరాదు. కోపము, విరోధము అవివేకలక్షణములు. కోప భయసంతోషములను మనసులోనే యణంచుకొని పైకిఁ బ్రబల విశ్వాస మున్నట్లు ప్రవర్తించుచు లోపల నెప్పుడును నమ్మక యుండవలయును. శత్రువిషయమునను ప్రియ

  1. *భారతము ; శాంతిపర్వము.