పుట:MaharshulaCharitraluVol6.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

మహర్షుల చరిత్రలు


చుండి రని యెఱిఁగి దేవతలపై మండిపడి వారి శత్రువులగు రాక్షసులకుఁ దాను గురువై యెల్ల దేవతలకును బృహస్పతికిని బ్రక్కలోని బల్లెమువలె నుండి తన కసి దీర్చుకొన నెంచి యుండెను. దేవతలు గురువును సంపాదించి యాతని యనుగ్రహమున గొప్పవారు కానున్నారని విని రాక్షసులును గురుసంపాదనలో నిమగ్ను లైరి. వారును వెదకి వెదకి శుక్రాచార్యునిఁ జేరి ప్రార్థించి యాతనిని దమగురువుఁ జేసికొనిరి. శుక్రుఁడును దేవతలకుఁ దగినబుద్ది చెప్పుట కిదియే మార్గ మనుకొని రాక్షసగురు వయ్యెను.

బృహస్పతి ఉపరిచరవసువునకు గురు వగుట

పూర్వము వసు వను నొక రా జుండెను. ఆతఁడు సత్య శమ దమము లగు సుగుణములకుఁ బుట్టినిల్లు. విష్ణుభ క్తికిఁ బెట్టినది పేరు. క్రతుకుతూహలమునకుఁ దావు. బ్రాహ్మణప్రియతకు నిధానము. ఆతఁడు రాజ్యము చేయనొల్లక వనమున కేగి మహాతప మొనరించు చుండ నింద్రుఁ డాతనికడ కేగి యాతనితోడి మైత్రి నెఱపి “రాజా? నీవు నాకు మిత్రుఁడ వగుము. మా వీటికి వచ్చుచుఁ బోవుచుండుము. భూపరిపాలన మానకుము. నీకు దివ్యత్వ మిచ్చితిని. నీకు రాకపోకల కొక రత్నవిమాన మిచ్చితి" నని యొసంగి యదృశ్యుఁ డయ్యెను. వసురాజు దానిని గైకొని భూమి నేలుచు స్వర్గమున కా విమానమున రాకపోక లొనరించుచుండి యింద్రమితుఁడై “ఉపరిచరవసు” వనఁ బరఁగెను.

ఉపరిచరవసువు ధర్మపరిపాలన మొనరించుచు బృహస్పతికి శిష్యుఁడై యాతనివలన ధర్మశాస్త్రప్రపంచమును గరతలామలక మొనరించుకొనెను. గురుననుమతిఁ గొని యొకప్పుఁ డా రాజొక యశ్వమేధ యాగ మారంభించెను. ఆ యజ్ఞమున సప్తమహర్షులు వారితో సమానులైన మఱికొందఱు మహర్షులు ఋత్విక్కులైరి. బృహస్పతి ఉపదర్శనము నడపింపఁ జొచ్చెను. ప్రజాపతి పుత్తులగు ఏకతుఁడు, ద్వితుఁడు, : త్రితుఁడు నను మునీంద్రులు సదస్యులైరి. రాజు పశుహింస మాని