పుట:MaharshulaCharitraluVol6.djvu/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిముందుమాట

మహర్షులు మంత్రద్రష్టలు; మంత్రపతులు. పవిత్రమైన భారతావనిలో ఎందరో మహర్షులు అవతరించి బ్రహ్మనిష్ఠాగరిష్ఠులై లోకోపకారకములైన ఎన్నో ఘనకార్యాలు నిర్వర్తించారు. ప్రజాసముదాయం ఆ మహర్షుల ఋణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు. యుగయుగాల భారతీయ సంస్కృతినీ, విజ్ఞానమునూ విశ్వమునకు చాటిన ధర్మస్వరూపులు వారు. తపస్స్వాధ్యాయ నిరతులై, నిగ్రహానుగ్రహ సమర్థులై, త్రికాలజ్ఞులైన మన మహర్షుల గుఱించిన విషయములెన్నో, శ్రుతి స్మృతి పురాణేతిహసాలలో కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మమును ఆచరించి లోకానికి ఆదర్శప్రాయు లైనారు. అనేక ధర్మశాస్త్రాలు రచించి ప్రపంచానికి ఉపకరించారు.

నారదుడు సంగీతమునకు, పరాశరుడు స్మృతికీ, హోరా శాస్త్రమునకూ పెట్టిన భిక్షయే ఈ నాటి మేటి విద్వాంసు లందరికీ శరణ్యం. నేటికీ మన భారత భూమిలో అసమాన మహిమాన్వితులైన యోగి పుంగవులు తమ ధర్మ ప్రబోధముతో భక్తులను తరింప జేస్తున్నారు.

“మహర్షుల చరిత్రలు" అను ఈ పుస్తకములో ఆరణ్యకమహర్షి, ఉదంకమహర్షి, జైగీషవ్యమహర్షి, ధౌమ్యమహర్షి, బృహస్పతిమహర్షి, మృగశృంగమహర్షి, వ్యాఘ్రపాదమహర్షి, శుక్రమహర్షి మున్నగు వారి చరిత్రలు సాకల్యంగా పౌర్వాపర్య సందర్భ సమన్వితంగా విచారింపబడినవి. ప్రతి మహర్షి జీవితాన్నిగూర్చి చదివినపుడు పఠితలు ఎన్నో అమూల్య విషయాలు ఆకళింతకు తెచ్చుకొని ప్రయోజనం పొందగలరు. భారతీయు లందఱికీ మహర్షుల జీవితచరిత్రలు అవశ్య పఠనీయాలే.