పుట:MaharshulaCharitraluVol6.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదంక మహర్షి

15


కాదన్న వేరుమార్గములేదు " అనుగుర్తు దేవికి నీతో జెప్పి పంపితిని. అనగా నీ కుండలములు మహర్షికి దానము చేసినచో దానివలన మనకు మేలగునని నా తలంపామెకు దెలియ జేసితిని. ఆమె పతివ్రత, ఉత్తమురాలు కావున నా భావ మెరిగి నిరుపమాన మగురత్నకుండల దానమును ఉత్తమోత్తమ బ్రాహ్మణుడ వగు నీకు వెంటనే చేసినది. " ఆ మాటలు పలుకుచుండు రాజునకు ఉదంకమహర్షి పుణ్యసాన్నిధ్యమున నొక మహాపుణ్యము సోకి శాంతవచనములు, కుండలదానశ్రద్ధ, నూతనసత్త్వ సంపద లభించెను. ఉదంకు డతనికడ సెలవుగైకొని గురుపత్ని కా కుండలము లిచ్చి తిరిగి వచ్చెద ననియు నపుడు తన్ను భక్షింపవచ్చు ననియు బలికెను. రా జాతనింజూచి " మహనీయ తపోనిధీ : నీ పెంపు నాకు గానవచ్చినది. చంపెడువానికడకు మగిడి వచ్చెడివారు గలరా ? నీవు దయయుంచి నీ తపశ్శక్తిచే నా యార్తింబాపి కాపాడవే " యని ప్రార్థించెను.

అపారకరుణ మెరయు నుదంకుడు రాజుం జూచి " రాజా ! ఏ కారణముచేత నైనను మహాత్ములకు గోపము వచ్చినను అది వెంటనే యుపశమించును. నీ దోషమువలన నీకీ కీడు వచ్చినది. నేను నీకడకు వచ్చుటయు, నీవు నా కోరిక తీర్చుటయు నివి యన్నియు నా గురువరు లగు గౌతమమునీంద్రుని చల్లనిచూపు వల్లనేయైయుండు ననుకొందును. వారి దయగలిగిన నీకును నాకును సకలలోకములకును మేలు కలుగు " నని పలికి తన కరకమలమున నా రాజు మేను నిమిరెను. వెంటనే రాజు రాక్షసత్వమును విడిచి శుద్ధసత్త్వుడై భక్తివినయ భరితుడై యాతనిం బ్రస్తుతించి నమస్కరించెను.

పిదప, మిత్త్రసహు డాదరమేదురముగా " మహాత్మా ! నీ వతిథివి. నా యింట గుడిచి నన్ను ధన్యునిజేసి మరి పొమ్ము " అని ప్రార్థించెను. ఉదంకు డందుల కంగీకరించెను. భోజనసమయమున అన్నములో తల వెండ్రుకలు వచ్చెను. ఉదంకు " డయ్యో ! నీ కింకను బాపక్షయము పూర్తిగా గాలేదు. ఐనచో నిట్టిదోషము నీకు బట్టియుండెడిది కాదు. అపరీక్షిత మైనయన్నము బెట్టితివి. కావున, నీ వంధుడ