పుట:MaharshulaCharitraluVol6.djvu/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదంక మహర్షి

11


గారణము ని న్నందఱికంటె నధికుని జేయుటకే యని గ్రహింపుము, ఆలస్యమైనదే వార్ధక్యము వచ్చినదే యని విచారింపకుము. శరీరము పరిణామపేశలమే కాని, వలసినపుడు యౌవన మీయగల శక్తిగల మాకడ నీ వందులకు దుఃఖింప బనిలేదు. మరి నీ శ్రద్ధకు మెచ్చితిని. నీ బుద్ధికి సంతసించితిని. నీ వృద్ధిని గోరెదను. ఇదిగో నీకు నిత్య యౌవన మొసంగితిని. నవయువతియు, శ్రద్ధావినయవివేకవతియు నగు నా ముద్దుకూతు నిచ్చెదను. పెండ్లాడి యౌవనసుఖము లనుభవించి గృహస్థాశ్రమమును నిర్వహింపుము. చిరకాలగురుసేవాగ్ని సంతప్త మగు నీ శరీరమును భరింప మానవ కాంతలకు సాధ్యము కాదు. గురుసుత తోబుట్టువుతో సమానురాలు, దీని నెట్లు బెండ్లాడుదు నని సందేహింపకుము. ఈమెకు శరీరాంతరము గల్పించెదను. అది జన్మాంతరసమానమే యగుట ధర్మదూష్యము కాదు. ఇది అధర్మము కాకుండునట్లును నీకు యౌవనము లభించునట్లును వరము లొసంగితిని " అని పలికెను.

గౌతమమహర్షి వరప్రసాదమున ఉదంకునికి నూతన యౌవనము, గౌతమునికూతునకు దివ్యసుందర నూత్నశరీరమును లభించెను. ఉదంకుడు గురువాజ్ఞ నౌదల ధరించి యా కన్యారత్నమును బెండ్లాడెను.

పిదప, ఉదంకుడు గౌతముని పాదములకు మ్రొక్కి " గురుదేవా ! న న్నిన్ని విధముల ననుగ్రహించిన నీకు గురుదక్షిణ యొసంగ గుతూహలపడుచున్నాను. నా యందు వాత్సల్య ముంచి యేదేని కోరి నాకా యవకాశము నొసంగ బ్రార్థించెదను. సర్వ శక్తిసంపన్నులగు తమకు నే నీయగలది లేదు. ఐనను, మీ కరుణకు నిదర్శనముగా నా కానతిం " డని ప్రార్థించెను. దానికి గౌతముడు " వత్సా ! నీవు నా కేమియును గురుదక్షిణ నీయవలసిన పని లేదు. లోకమునందలి గురులకు దక్షిణ కావలయును. నీవు సత్ప్రవర్తనమున నుత్తమగృహస్థ ధర్మమును పాలించుటే నా కిచ్చు గురుదక్షిణ " అని బదులుచెప్పెను. ఉదంకు డూరకుండక అహల్యాసాధ్విపాదములకు నమస్కరించి యేదైన వస్తువు గోరుకొమ్మనియు గురుదక్షిణకన్న గురుపత్నీదక్షిణ యధిక