పుట:MaharshulaCharitraluVol6.djvu/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

10

మహర్షుల చరిత్రలు


జిక్కికొని యూడిపడిన తనతలవెండ్రుకలు తెల్లనికాంతుల నీనుచు దన వార్ధక్యదశను జెప్పకచెప్పెను. వెంటనే యాతడు " అయ్యో ! నా శిరోజము లప్పుడే తెల్లపడిపోయినవే ! నా బాల్య కౌమార యౌవన దశలన్నియు గురుశుశ్రూషలో గడచిపోయినవే ? నేను జేరినతరువాత జేరిన శిష్యు లనేకులు విద్యాపరి పూర్తియై గుర్వాజ్ఞ వెడలిపోయిరే ! నా కింక విద్యాపరిపూర్తి కాదా ? గుర్వనుగ్రహమే కలుగదా ! గురుని యాశీర్వచనము, గురువరప్రసాదము, గురు వభయ మిచ్చి వీడ్కొలు పుటయు నా కీజన్మమున గలుగవా? నే నేమియు గురుద్రోహము చేయలేదే ? అహల్యాసాధ్విని గన్నతల్లిగా భావించి యామెసేవ నెన్న డేమరక చేయుచునే యుంటినే? కోటాన గోటులు శిష్యులు వచ్చి చదివి కృతార్థులై పోవుచుండ నేను శాశ్వతముగా నిట్లుండిపోవలసినదేనా ? నా జన్మ మంతయు వ్యర్థ మైనదా ?" అని యెన్నోయూహలు కలుగ నొక్కసారిగ బెల్లుబికివచ్చిన దుఃఖము నాపుకొనలేక వెక్కివెక్కి యేడ్వదొడగెను.

దయాసముద్రు డగు గౌతమ మహర్షి యిది యంతయు దివ్య దృష్టిని గ్రహించి తన కొమార్తెయు జక్కని చుక్కయు నగు తరుణిని ఉదంకుని యశ్రువులు భూమిపై బడనీయక దోసిటబట్టుమని పంపించెను. ఆమె పరుగున వచ్చి ఉదంకుని కన్నీరు దోసిట బట్ట సలసల క్రాగునావేడికన్నీటిచే నామె చేతులు వేడెక్క భరింపలేక యామె నేల విడిచెను. నేలబడిన యామేర యంతయు దుకతుక నుడికి పోయెను.

వెంటనే గౌతమమహర్షి యుదంకుని బిలిచి " వత్సా ! నీ దుఃఖమునకు గలకారణ మేమి ? నిస్సంకోచముగా జెప్పు " మని యడిగెను. ఉదంకుడు " మహాత్మా ! కోటాన గోటులగు మీ శిష్యులపై మీకు గల దయలో నాపై సహస్రాంశమైనను లేకపోవుటకు నే జేసినదోష మే మని దుఃఖించితిని. అంతకన్న నేమియు లేదు. క్షమించి రక్షింపు " డని గురుని వేడుకొనెను.

గౌతము డంత " వత్సా ! నీ గురుభక్తికి నేను మిక్కిలి సంతసించితిని. శిష్యు లెల్లరకు నేను వీడుకో లిచ్చి నీ కీయకుండుటకు