పుట:MaharshulaCharitraluVol6.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

మహర్షుల చరిత్రలు


రాలుచుండ, గన్నులు మూతపడ, భక్తివశమున దేహమును మరచి పోయెను. కరుణాసముద్రుడగు శ్రీరాముడు లేచి యాతని కెదురేగి, కౌగిలించుకొని చేతులు పట్టుకొని తీసికొని వచ్చి యుచితాసనమున గూర్చుండబెట్టి పాదములు కడిగి యా జలములు తలపై జల్లుకొని, గంధపుష్పాదులచే ఆ మహర్షిని పూజించి, పాడియావు నొసంగి, మార్గశ్రమము పోవున ట్లుచితోపచారము లొనర్చి " స్వామీ ! నీ సందర్శనమున నా యిల్లు పవిత్ర మయ్యెను. నేను ధన్యుడ నైతిని. నేటితో నాయశ్వమేధ యాగముకూడ బూర్తి కానున్నది. మహదాగమనము సకలఫలప్రదముగదా !" యని యాతని ననేక విధముల సంప్రీతు నొనర్చెను.

అంత, ఆరణ్యకమహర్షి శ్రీరాముని పాదపద్మములపై సాష్టాంగపడి "దేవ దేవా ! నీ నిర్వ్యాజకటాక్షవీక్షణమున నా జన్మము ధన్య మయ్యెను. నా తపస్సు పండెను. నేను తరించితిని. సంసార సాగరమును దరించితిని. పరంధామా ! నీ సాయుజ్యప్రాప్తి నా కొసంగి రక్షింపుము. ఈ సుదినమునకై యెదురు చూచుచుంటిని. పాంచభౌతిక మగు నా యీ పాడుదేహమును విడిచి పుచ్చి తత్క్షణమే నీలో నైక్యమై బ్రహ్మజ్ఞానసంపన్నులు, యోగీశ్వరేశ్వరులు, భక్తిసంపన్నులు, పొందు నపునరావృత్తి రహిత శాశ్వతబ్రహ్మలోకనివాససిద్ధి నందుదు" నని పలుకగనే యా మహర్షి బ్రహ్మకపాలము పఠిల్లున బ్రద్దలై యందుండి యొకదివ్యతేజ మా శ్రీరామచంద్రునిం గలిసెను. దేవతలు పుష్పవర్షము గురిసిరి. కిన్నరకింపురుషులు గంధర్వులు "జయజయ ! సాయుజ్యమోక్షము నందిన ఆరణ్యకా ! జయ జయ " అను ధ్వను లొనర్చిరి. సెలయేరు వచ్చిచొచ్చిన మహాసముద్రునివలె శ్రీరామచంద్రు డతిగంభీరప్రశాంతదివ్యతేజస్వియై మెరసెను.