పుట:MaharshulaCharitraluVol6.djvu/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతకేతుమహర్షి

115


మాత్ముఁడు అవాఙ్మనసగోచరుఁ డయ్యు-సాధనోపదేశమార్గసూచక ఉపలక్షణవ్యాకృతిపద్ధతులచే నాతఁడు వేదవేద్యుఁ డగుచున్నాఁడు. పరిశుద్దజ్ఞానము ఆత్మవిషయికధ్యానముచేఁ గలుగును. దానివలన నుత్తమగతి కలుగును. పరమాత్మ విభూతులు బహుళములు. వాయుదేవుఁడు, అగ్నిహోత్రుఁడు, సూర్యభగవానుఁడుకూడఁ బరమాత్ము నెఱుంగరు. ఆ పరమాత్ముఁడు జగద్వ్యాపి. బ్రహ్మజ్ఞానసంపన్నులు మాత్రమే పరమాత్మ నెఱింగి యది ఆ మగుచున్నారు”

శ్వేతకేఁతుఁ డీ విధముగా నాయాబ్రాహ్మజ్ఞానవిషయములు సమయోచితముగా భార్యకుఁ దెలుపుచు నామెను జ్ఞానవంతురాలిని గావించెను. జ్ఞానసౌభాగ్యమును గాంచిన యా పుణ్యదంపతులట్లు చిరకాలము గృహస్థాశ్రమమున నుండి తుదకు సన్న్యస్తచిత్తులై గోవిందుని పదపద్మముల మనస్సులు నిలిపి మరణానంతర ముత్తమగతులను మోక్షసామ్రాజ్యమును జూఱగొనిరి.*[1]

శ్వేతకేతుతీర్థము

సమంగానది పొంత సోమకశిబి తీర్థముల సామీప్యమున శ్వేతకేతుమహర్షి తపము చేసినచోటు 'శ్వేతకేతుతీర్థ ' మని జగత్ప్రసిద్ధిగాంచెను. ఈ తీర్థప్రదేశమున సకలవృక్షములు సర్వకాల సర్వావస్థలయందు సకల ఫలపుష్పసహితములై బహు రమణీయములై యుండును. ఈ వవిత్రాశ్రమముననే వాగ్దేవత యగు సరస్వతి మానుషదేహధారిణియై శ్వేతకేతునకు దర్శన మొసంగి యాతనికడ నుండి కరుణించేను.†[2]  1. *భారతము; మోక్షధర్మపర్వము.
  2. †భారతము ; ఆరణ్యపర్వము.