పుట:MaharshulaCharitraluVol6.djvu/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వేతకేతుమహర్షి

113


శరీరసంబంధమునఁ జేసి ఆత్మకు జననము కలదని యనుకొనునాఁడు దానికి బంధమును గలదు. నీవు నేను, నేను నేను సర్వము: నేను అని యనుకొనునాఁడు శరీరమే లేదు." అని శ్వేతకేతుఁడు చెప్పెను. ఆ మాటలు విని యామె " మహాత్మా ! నీ వింత ప్రాజ్ఞుఁడవై యుండియు నజ్ఞానివలె సమస్త కర్మలు నొనర్చుచున్నావు. సహధర్మచారిణి నగుట నేను ని న్ననువర్తించుచున్నాను. ఇందు నీ భావ మేమి? దయతో సెల విమ్ము” అని కోరెను. ఆతఁ దిట్లనెను. “సుదతీ! పెద్ద లాచరించినది పిన్నలకు ఒరవడి యగును. లోకవ్యవహారము సక్రమముగ నడచుట కెల్ల రును గర్మ లాచరింపవలయును. కర్మహీనతవలన జాతి నిర్వీర్యమై లోకము చిందరవందర యగును. ధర్మము నశించును. చిన్న చేఁపను మ్రింగు పెద్దచేఁపవలె బలవంతుఁడు బలహీనునిఁ గబళించును. సర్వలోక కర్త భర్త హర్త యగు పరాత్పరున కది యనిష్టము. మఱియు సర్వ జగత్సృష్టియు భగవంతునికిఁ గ్రీడామాత్రము. ఆతని విభూతు లనంతములు. అతని శక్తు లపారములు. సృష్టిస్థితిలయము లను పెనుగహ్వరముల జీవి చిక్కుకొని యున్నది. జననమరణసంసారరూప మగు బంధములఁ దెగద్రెంపుకొని యెవఁ డాత్మజ్ఞానము నందుచున్నాఁడో వాఁడు భగవంతునికిఁ బ్రియుఁడు. అట్లుగాక జనన మరణసంసారప్రవాహ మధ్యమునఁ గొట్టుకొనిపోవుచు దుర్మార్గుఁ డగునిర్భాగ్యుఁడు నరకకూపమున మ్రగ్గుచుఁ దనచుట్టునుగల బంధములఁ ద్రెంచుకొనుటకు బదులు పెంచుకొనుచుండును. దట్టముగ నలముకొన్న యజ్ఞానతిమిరమునఁ బడి యది తన యదృష్టవిశేష మని యహంకరించుచు నిర్భాగ్యుఁ డగు నరుఁడు నిత్యపతనము నందుచునే యుండును. కావున, దేహశుద్ధికొఱకు ఆత్మజ్ఞానవికాసముకొఱకు, లోకమువారికి ఒరవడి యగుట కొఱకు నేను సత్కర్మాచరణముఁ జేయుచున్నాను. దేహపతనపర్యంతము నట్లొనరించుచునే యుండవలయును.”

ఆ మాటలకు మిగుల నానందించి సువర్చల "దేవా! శబ్దము, అర్థము వీనిని వివరింపు" మని కోరెను. " అక్షర సంపుటి నుచ్చరింపఁగా వెలువడునది శబ్దము. ఆ శబ్దముచేతఁ దెలుపఁబడున దేదియో అది యర్థము. శబ్దార్ధములకు నిత్యసంబంధము లేదు. ఉచ్చారణనుబట్టి