పుట:MaharshulaCharitraluVol6.djvu/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

97


అలిగిన నలుగక యెగ్గులు
పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
పలుకక బన్నమువడి యెడఁ
దలఁపక యున్న తఁడ చూవె ధర్మజ్ఞుఁ డిలన్.
                                       భార. ఆది. 146, 147.

కావున, బుద్ధిహీనులే కాని బుద్ధిమంతులు ఎవరిమీఁదను గోపింపరు. ఇంతకు శర్మిష్ఠ రాజుకూఁతురు. చిన్నపిల్ల . దాని తెలివితక్కువ తనముఁ జూచి జాలిపడవలయునే కాని కోపింపఁ జనదు" అని బోధించెను. కాని, దేవయాని వినక " తండ్రీ !

కడు ననురక్తియు నేర్పును
గడఁకయుఁ గలవారి నుఱక కడవఁగ నెగ్గుల్
నొడివేడి వివేకశూన్యుల
కడ నుండెడు నంతకంటెఁ గష్టము గలదే.
                               (భార. ఆది. 3. 149)

నేనేమైన నా నగరు తొక్క" నని భీష్మించి యుండ శుక్రాచార్యుఁడు నటనే నిలిచిపోయెను. ఈ సంగతి యంతయుఁ జారులవలన విని వృషపర్వమహారాజు త్వరితగతి వచ్చి తండ్రికూఁ తుళ్ళ కెఱఁగి “ఆచార్య! నీవలననే రాక్షసకుల ముద్దరింపఁ బడినది. నీ ఋణము మే మెట్లును దీర్చుకొనలేము. మా సమస్తైశ్వర్యములు, పుత్రమిత్ర పరివారము, ధనధాన్యసంపదలు అన్నియు నీవే. నీ వెట్లు చెప్పిన నట్లు నడచుకొందుము. దేవయాని యేమి చేయుమన్న నది చేయుదును క్షమింపు” మని ప్రార్థించెను.

అట్లైన "నీకూఁతును వేయిమందికన్యకలతో నాపాద దాసి నొనర్పు" మని దేవయాని వృషపర్వుని గోరెను. ఆతఁడు మహాప్రసాద మని యట్లే యొనరించెను. శర్మిషయుఁ దనతప్పిదము నెఱింగి క్షమింపఁ బ్రార్థించి తండ్రియానతి తలధరించి దేవయానికి వేయిమంది కన్యలతో సేవచేయుచుండెను.