పుట:Maharshula-Charitralu.firstpart.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపిలమహర్షి

67


భజింపుము. మోక్షము నొందెద" వని కర్తవ్యము బోధించెను. అంతఁ గర్దముఁడు నాతని కధికభక్తి ననేక వందనములు చేసి మునిగణసేవిత మగు వనమున నిస్సంగుఁడై , యాత్మైక శరణతత్పరుఁడై పరబ్రహ్మమును జిత్తముల నిలిపి సమత్వ శాంత శేముషీగరిష్ఠుఁడై, ధీరుఁడై నిఖిలప్రపంచము వాసుదేవమయముగానెంచి భక్తిభావమున భాగవతగతిం జెందెను. ఇటఁ గపిలమహర్షి బిందుసరమునఁ దీవ్ర తపోనియతి నుండెను.

కపిలమహర్షి దేవహూతికి మోక్షమొసఁగుట

అంత దేవహూతియుఁ గొమరుని దర్శించి యాతని శరణంబువేఁడి రక్షింపుమని యాశ్రయించెను. కపిలమహర్షి యాత్మ నలరి దేవహూతికి జీవునిచిత్తము సంసారమునఁ దగులుకొని త్రిగుణాసక్తమగుననియు, నదియే నారాయణా సక్తమైనచో మోక్షకారణమగు ననియుఁ జెప్పెను. పిమ్మట నాతఁ డామెకు సాంఖ్య యోగమును, భక్తియోగమును బోధించెను. తరువాత దేవహూతి కపిలోక్తమార్గముస గురుయోగశక్తిచే నంబరమున కెగసి వాసుదేవ చరణాంబురుహన్యస్త చిత్తయై శ్రీహరియందుఁ గలిసెను. ఆమె మోక్షమున కేఁగిన క్షేత్రము "సిద్దిపద" మని ప్రసిద్ధికెక్కెను. అంతఁ గపిలమహర్షియు సిద్ధచారణాదులు గొలువ సముద్రునిచేఁ బూజాదులందెను. ఆతఁ డనంతరము సాంఖ్యాచార్యా భిష్ఠుతమగు యోగము నవలంబించి శాంతి సమాహితుఁడై పిత్రాశ్రమమును వీడి యుదగ్భాగమున కేగెను.[1]

కపిలమహర్షి వేదప్రామాణ్యబుద్ధి

ఒకప్పుడు కపిలమహర్షి యుత్తమాకృతి యగు గోవునుజూచి వేదస్వరూపమని పలికియు నిర్లక్ష్యముగ నుండెను. కొంత దూరమున

  1. భారతము - హరివంశము.