పుట:Maharshula-Charitralu.firstpart.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

కపిల మహర్షి

తొల్లి కర్దమప్రజాపతి కృతయుగమున విశ్వసృష్టికై బ్రహ్మచే నియోగింపఁబడి సరస్వతీనదీతీరమున కేఁగి పదివేల దివ్యసంవత్సరములు తపముచేసెను. ఆతఁ డొకనాఁడు జపసమాధి నేకాగ్రచిత్తుఁడై విష్ణుమూర్తిని ధ్యానింపఁగా నాతఁడు ప్రత్యక్షమై దేవహూతివలనఁ దొమ్మండ్రు కూఁతులును దన యంశముచే నొక కుమారుఁడును నాతనికి జన్మించునని వరమిచ్చి యంతర్హితుఁ డయ్యెను. తరువాతఁ గొంత కాలమునకే దేవహూతికిఁ గర్దమునివలనఁ గళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు. గతి. క్రియ, ఖ్యాతి. అరుంధతి, శాంతి యను తొమ్మండ్రు కూఁతుం డుద్భవించిరి. పిమ్మటఁ గర్దముఁడు సన్న్యసింప నెంచఁగా దేవహూతి యాతని పదములకు మ్రొక్కి "దేవా! కూఁతుండ్రకు యుక్తకాలమున వివాహముచేసి యాపై నాకు జ్ఞానోపదేశము చేయఁగల సుకుమారుని దయచేయుఁడు నేను తరించిన పిమ్మటఁగాని తాము సన్న్యసింప వల" దని వేదనా భరమునఁ బలికెను. కర్దముఁ డామె గర్భమున నచిరకాలముననే జనార్దనుఁడు సుతుఁడై పుట్టును గాన నాతని పాదపద్మములు పూజించుచుండు మనియు నా కుమారుఁడే యామె శంకాగ్రంథి విచ్ఛేదము చేయుననియుఁ జెప్పి గృహముననే యుండెను.

కపిలుని జననము

దేవహూతి భర్తవాక్యానుసార మట్లు భగవంతునిఁ బ్రార్థించుచుండఁగాఁ గొంతకాలమునకుఁ గార్దమ మైనతేజమున విష్ణుమూర్తి దేవహూతిగర్భమును బ్రవేశించి కాలక్రమమున దనుజారి శమీతరుకోటరమున వైశ్వానరుఁ డావిర్భవించినట్లామె గర్భమున గుమారుఁడై