పుట:Maharshula-Charitralu.firstpart.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

మహర్షుల చరిత్రలు


వారట్లుచేయఁగ భగీరథుఁడు జన్మించెను. కాని, యాతఁడు శుక్రము లేక యే జన్మించినకతమున బాల్యమునుండియు సర్భకుండై పడుచు లేచుచు నుండువాఁడు. ఈ భగీరథునిఁ గాంచి యష్టావక్రుఁడు దన కృశశరీరమును గాంచి యాతఁడపహాసము చేయుచుండెనని భావించెను. కాని, స్థిరముగా నిశ్చయము చేసికొననివాఁ డగుట నాతఁ డపహాసమున కట్లు తూలుచు నడుచుచున్నచో వెంటనే భస్మ మగునట్లును గానినాఁడు దృఢశరీరుఁడై సుందరాకారుఁ డగునట్లును శపించెను. వెంటనే యాశాపము భగీరథునికి వరప్రసాదము కాఁగా భగీరథుఁడు దృఢగాత్రుఁడై సుందరాకారుఁడయ్యెను. అష్టావక్రుఁడది చూచి యోగదృష్టివలన నాతని జన్మాదుల నెఱఁగి యాతఁడు గంగను భూమికిఁ దీసికొని వచ్చి యాతని పిత్రుపాదుఅను స్వర్గమునకుఁ బంపు నని యాశీర్వదించి తన దారిని బో యెను.

అష్టావక్రుని పూర్వజన్మ కథ

అష్టావక్రమహర్షి యనేకసంవత్సరములు పుష్కర తీర్థమునను మాల్యవంతమునను బరమవైష్ణవుఁడై పరమజ్ఞానియై మహా తపస్సు చేసెను. పిమ్మట నొకనాఁడు శ్రీకృష్ణుఁడు. రాధాదిభార్యలు బలరామప్రభృతులుఁ గూడరాఁగా బృందావనమున విహరించుచు జలక్రీడలఁ దనిసి యొక మఱ్ఱిచెట్టుక్రిందఁ గూరుచుండి సరససల్లాపము లాడుచుండఁగా నష్టావక్రమహర్షి వచ్చి శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారములొనర్చి యీశ్వరదత్తమగు స్తోత్రమున నిట్లని కీర్తించెను.

సీ|| "ప్రకృతియు మూలంబు బ్రహ్మేశవిష్ణువుల్
               శాఖలు సుర లుపశాఖ లఖిల
       తపములు పుష్పముల్ విపులసంసారాది
              కంబులు ఫలసమూహంబు లగుచుఁ
       దనరు బ్రహ్మాండపాదమున కర్థి నా
.