పుట:Maharshula-Charitralu.firstpart.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టావక్ర మహర్షి

51


నృత్యగీతములను దామువిని చిరకాలమైనది. ఒకసారి తమకుఁ జూపి మెప్పుపొంద వచ్చితి" మని వారనిరి. అట్లైనఁ బ్రదర్శింపుఁ డని యష్టావక్రుఁడు జలములోనే కూర్చుండెను. రంభాదు లద్భుతముగాఁ దమనై పుణ్యముఁ జూపిరి. అందుల కష్టావక్రుఁ డానందించి మీకేమి కావలెనో కోరుకొండనెను. అంత వారు విష్ణుమూర్తితోడి సంభోగము కావలె నని కోరిరి. అష్టావక్రుఁ డాలోచించి శ్రీ విష్ణుమూర్తి కృష్ణావతారముఁ దాల్చినపుడు మీరు గోపికలై జనింతురు. అప్పుడు మీకోరిక సిద్ధించును. పొం" డని చెప్పి బయటకు వచ్చెను. అతని యాకారముఁజూచి రంభాదులు వెంటనే నవ్విరి. అష్టావక్రుఁడు వారి యవినయమునకు గర్వమునకు నసహ్యించుకొని "మీకోరిక సిద్ధింప వరమిచ్చిన నన్నుఁ జూచియే మీరు నవ్వితిరి. కాన, మీరు శ్రీకృష్ణుని పరోక్షమున బోయ వాండ్రచేఁ జుట్టుముట్టఁబడి ఘోరావమానముల నందుదురు గాక" అని శపించి యాశ్రమమున కేఁగెను.[1]

అష్టావక్రుఁడు భగీరథుని దీవించుట

అష్టావక్రమహర్షి ఘోరతపఃకార్యముచే దేహజవసత్వములఁ గోల్పోయి యస్థిపంజరము మాత్రము మిగిలినదా యనునట్లుండెను. ఈ స్థితిలో నొకనాఁ డష్టావకుఁ డొకచోటికిఁ బోవుచుండెను. దారిలో భగీరథుఁ డితని కెదురు వచ్చెను. సగర పుత్త్రులు కపిలమహర్షి కనుమంటచే భస్మీభూతులై పోవ వారి భార్యలు నారాయణు నారాధించి "వంశోద్దారకుఁ డగు సత్పుత్త్రు నీయకయే భర్తలు చనిపోయిరి. ఇఁక మాగతి యే" మని నారాయణుఁడు ప్రత్యక్షమైనప్పు డడిగిరి. విష్ణుమూర్తి వారిపై జాలిగొని “కాంతలారా! మీరు భర్తృవిహీనలైనను వైధవ్యదోషము మీకుఁ గలుగకుండు నట్లనుగ్రహించితిని. మీకు నుత్తమోత్తముఁ డగుకుమారుఁ డుదయించు" నని యొక యుపాయము చెప్పి యంతర్హితుఁ డయ్యెను.

  1. విష్ణు పురాణము.