పుట:Maharshula-Charitralu.firstpart.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

మహర్షుల చరిత్రలు


లందు దోషము లేదనియు “నావిష్ణుః పృథీవీపతిః" అను భావమున నవి ధర్మయుక్తములే యని తీర్మానించెను. అంత సదస్యు లందఱును బృథుచక్రవర్తితో నీ నిర్ణయమును నివేదింప నాతఁ డత్రిమహర్షిని గీర్తించి యనేక ధనకనకవస్తు వాహనములిచ్చి సత్కరించెను. అత్రి మహర్షియు వానిని దీసికొని వెళ్ళి పుత్త్రులకుఁ బంచి యిచ్చి వారలు వయసు గన్నంతనే భార్యా సహితుఁడై ధర్మసంహిత బుద్ధితో వనమున కేఁగెను.[1]

అత్రిమహర్షి సూర్యచంద్రుల రక్షించి రాక్షసుల భస్మము చేయుట

ఒకప్పుడు దేవతలకు జంభాదిదైత్యులకు గొప్ప యుద్ధము సంభవించెను. అందు రాహునస్త్రసమితిచే సూర్యచంద్రులు సోలిపోఁగా వెలుఁగు నశించి లోకమంతయు నంధకారబంధుర మయ్యెను. అప్పుడు రాక్షసులు విజృంభించి దేవతల నొప్పింపఁదొడగిరి. దేవతలు భయార్తులై యత్రిమహర్షి కడ కరుదెంచి దమదుస్థ్సితిని సూర్యచంద్రుల పాటును జెప్పి తమ్ము రక్షింపవలె నని వేఁడుకొనిరి. అత్రిమహర్షియు వెంటనే వారి కభయమిచ్చి సూర్యచంద్రుల శరీరముల నక్షతము లగు నట్లు చేసివై చెను. పిమ్మట నాతఁడు తీక్ష్ణదృష్టిమాత్రముననే రాక్షసులెల్లరు మడియునట్లు చేసెను. అంత దేవతలెల్ల రత్రిమహర్షి కటాక్షమున బ్రతికితి మని యాతని నెంతయు శ్లాఘించి వెడలిరి. ఆహా ! మహర్షుల మహత్త్వము వర్ణనాతీతము గదా! జగద్ధితార్ధము దేవకార్యనిమి త్తము నత్రిమహర్షి యనంతములగు నిట్టిమాహాత్మ్యము లెన్ని టినో చూ పెను. [2]

అత్రిమహర్షి సీతారాముల కాతిథ్యమిచ్చుట

భరతుఁడు సపరివారుఁడై యరణ్యమున నున్న సీతారామలక్ష్మణులకడకు వచ్చి శ్రీరామునిపాదుకలు గొని నందిగ్రామమున కేఁగిన

  1. భారతారణ్యపర్వము.
  2. బ్రహ్మాండపురాణము.