పుట:Maharshula-Charitralu.firstpart.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్రి మహర్షి

39


అత్రిమహర్షి పృథుచక్రవర్తికడ కేఁగుట

అచటఁ బృథుచక్రవర్తి యాగాశ్వమును విడిచి తత్సంరక్షణమునకై పుత్త్రుని బంపుచు నత్రిమహర్షి నాతనికి సాహాయ్యము గమ్మని ప్రార్థించెను. అత్రిమహర్షి యంగీకరించి వెడలెను. పృథుచక్రవర్తి యాగవైభవమును జూడలేక యింద్రుఁడు పాషండవేషమునఁ దిరోహితుఁడై యాగాశ్వము నపహరించి యాకాశమున కేఁగెను. పృథువుత్త్రుఁ డత్రిసాహాయ్యమున వాని ననుసరించి దేవేంద్రునిపై బాణము వేయ సంశయించు చుండఁగా నత్రిమహర్షి యజ్ఞహంత నెంతవానినై నఁ జంపవచ్చునని యాతనికి బోధించెను. అంతఁ బృథుపుత్త్రుఁ డింద్రునిపై బాణము లేసి నొప్పింప నింద్రుఁ డశ్వమును విడిచి పాఱిపోయెను. అత్రీసహితుఁడై రాజకుమారుఁ డశ్వమును ద్రోలి తెచ్చుచుండఁగా నింద్రుఁడు మరల దాని నపహరించెను. ఈసారి పృథుపుత్త్రున కిది గోచరము కాలేదు. అత్రిమహర్షి దివ్యనేత్రములఁ జూచి యాతనికిఁ జెప్పఁగా నాతఁడు మరల నింద్రుని దరిమి యాగాశ్వమును గొని తెచ్చెను. అశ్వమేధయాగ మాపై నిర్విఘ్నముగాఁ బూర్తి కాఁగానే పృథుచక్రవర్తి బ్రాహ్మణుల కనేక దక్షిణ లిచ్చి సంతృప్తి పఱచుచుండెను. ఆసమయమున నత్రిమహర్షి పృథుచక్రవర్తి నింద్రుఁడనియుఁ జంద్రుఁ డనియు విధాత యనియుఁ గీర్తించెను. అటనున్న గౌతమమహర్షి యిది విని "యొక మానవమాత్రు నింతగా నేల నుతింతు" వని యాతని పైఁ గలుషించెను. అత్రియుఁ దన వాక్యముల దోషము లే దనెను. క్రమముగా నిరువురకు వాదము ప్రబలెను. నాఁటి సభాంగణమునఁ గల ఋషిపుంగవు లాధర్మనిర్ణయముఁ జేయఁ జాలకుండిరి. అంతఁ గాశ్యపమహర్షి లేచి సనత్కుమారుఁడు దక్కనన్యు లీసమస్యఁ దేల్ప లేరని వక్కాణించెను. అంత నాసదస్యు రందఱతో నత్రి గౌతములు సనత్కుమారుపాలి కేఁగి యా వాదమును దెలియఁబఱచిరి. సనత్కుమారుఁడు అత్రి వాక్యము