పుట:Maharshula-Charitralu.firstpart.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

మహర్షుల చరిత్రలు


మొనర్చెను. ఆ తపోనలముచేఁ ద్రిజగములును గలఁగుఁడువడఁగా బ్రహ్మవిష్ణుమహేశ్వరులు మువ్వురును బ్రత్యక్షమైరి. . అత్రి వారిని బూజించి "నేను సత్సంతానార్ధమై దేవాదిదేవుని గుఱించి తపమొనర్స మువ్వురేల వచ్చితిరి? మీలో నధికులెవ? రని వారిని బ్రశ్నించెను. ఆ త్రిమూర్తులును దమ కభేదమని చెప్పి తమ యంశములచేఁ ద్వరలోనే యాతనికి సత్పుత్త్రోదయ మగు నని వర మిచ్చి యదృశ్యులైరి.

అత్త్రిమహర్షికి లోకోత్తరపురుషు లుదయించుట

కాలక్రమమునఁ ద్రిమూర్తులవరమున నత్రిమహర్షి నేత్రగోళమునుండి చంద్రుఁడును ననసూయాగర్భమున దత్తాత్రేయ దుర్వాసులును క్రమముగా బ్రహ్మవిష్ణు మహేశ్వరాంశములతో నుద్భవించిరి. ఆ మువ్వు రట్లు జన్మించి దినదిన వర్ధమానులై తల్లిదండ్రుల కధికామోదమును గూర్చుచుండిరి.

ఇట్లు పుత్త్రులు పెరుఁగుచుండఁగా నత్రిమహర్షి తపోధ్యాన నిమగ్నుఁడై యనసూయను బిలిచి “సాధ్వీ! నీవు కోరినట్లు సత్పుత్రు లుదయించినారు. నే నిఁకఁ దపోజీవనము సభిలషించుచున్నాను. నీవు నాతో నుందువా? లేక యీ బిడ్డలకడ నుందువా?" యని యడిగెను. అనసూయ వినయవిధేయతలతో "మహాత్మా! పుత్త్రు లింకను బెరిఁగి పెద్దవారు కాలేదు. అగుట నిపుడే యాశ్రమాంతరమున కరుగుట ధర్మము కాదు. కావునఁ బుత్త్రపోషణార్థమై పృథుచక్రవర్తికడ కరిగి యర్థముఁ గొనితెండు, వారలఁ బెంచిన పిమ్మట మన ముభయులము వానప్రస్థాశ్రమమున కరుగుట లగ్గు. తమకుఁ జెప్పుటకు నేనెంతదానను! ఐనను దమ యభీప్సితమే యొనరింతు" నని వాక్రుచ్చెను, అత్రిమహర్షియు నామె వాక్యములందలి ధర్మము నౌచిత్యము గ్రహించి ధనార్థియై పృథుచక్రవర్తి చేయుచున్న యశ్వమేధయాగమును జూడనేఁగెను.