పుట:Maharshula-Charitralu.firstpart.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

మహర్షుల చరిత్రలు


కర్దమప్రజాపతి తన కూఁతుండ్రను బ్రహ్మర్షులకే యిచ్చి వివాహము చేయనెంచి వారిలో నొకతె యగు ననసూయకుఁ దగినవరుఁ డత్రి మహర్షి యే యని యాతనిఁ బిలువనంపెను. అత్రిమహర్షి యుఁ గర్దమునియొద్దకు వచ్చి యాతని కోరికపై ననసూయను వివాహమాడి యత్తమామల యాశీర్వచనము అంది తన యాశ్రమమునకు సభార్యుఁడై వెడలిపోయెను.

ఈ ప్రకార మత్రిమహర్షి గృహస్థాశ్రమమును స్వీకరించి యనసూయాసాధ్యితోఁ గాపురము చేయుచుండెను. అనసూయ తన యద్వితీయ భర్తృసేవలో సమస్తమును విస్మరించుచుండెను. భర్తనే దై వముగా నెంచి యాతనికి సకలోపచారములను జేయుచు నాతని హృదయమును జూఱగొని జ్ఞానోపదేశము. ననంతమహత్త్వము నాతనివలన నామె పడయఁ గల్గెను. ఆహా! ఆహారవిహారనిద్రాసంగమ వ్యామోహాదులచే నవవిత్రమై యత్యంత దుఃఖప్రద మగు సామాన్య సంసార జీవనమునకు, నాత్మానవద్యవిద్యానందముచే వినశ్వర దేహసుఖవిదూరము విశ్వమంగళార్థము వినియుక్తము మమకార రహితమగు మహర్షుల సంసారజీవనమునకు నెంతదవ్వు![1]

త్రిమూర్తు లనసూయకు వరము లొసఁగుట

అందుచే నత్రిమహర్షి దయవలన నససూయకు నానాఁటికి గొప్పతనము హెచ్చుచుండెను. ఒకనాఁడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అనసూయ మాహాత్మ్యమును బరీక్షింప నెంచి యత్రిమహర్షి యాశ్రమమునకు వచ్చి యాతిథ్యము కోరిరి. అత్రి మహాప్రసాద మనెను. కాని, యా త్రిమూర్తులును దమకొక వ్రతము కలదనియు దాని ప్రకార మానాఁడు తమకు వడ్డించు స్త్రీ నగ్నయై వడ్డింపవలె ననియుఁ జెప్పిరి. అత్రిమహర్షి యనసూయతో నీ విషయమును

  1. భాగవతము - తృతీయస్కంధము.