పుట:Maharshula-Charitralu.firstpart.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అత్రి మహర్షి

35


ధర్మములు, తపోవ్రతములు నేర్పడినవి. తాను కాని దేహముపై మమత్వము నశింపఁ జేసికొనుటకుఁ దానైన యాత్మవలని యానందమనుభవించు శక్తిఁ గనుటకు దేహము నుపవాసాది కఠిననియముములచేఁ గృశింపఁ జేయవలయును. అట్టి దేహ కార్శ్యమువలన దుఃఖము నందక యాత్మానందస్థితిని నిలువఁగలిగినవా రే మహర్షులు. ఈ శాశ్వత స్థితికి నిత్యతపోనిరతియే మార్గము. ఈ స్థితినున్న వా రనంత శక్తిమయులు. దీనినే యత్రి సాధింప దొరకొనెను. ఇట్టి మహోగ్రతవస్సంపన్నుఁ డగు నత్రిమహర్షి నేత్రగోళముల నుండి కొంతకాలమున కొకదివ్యతేజ ముదయించెను. ఆ మహాతేజ మంతు లేనిదై భూనభోంతరమంతయు వ్యాపించెను. దశదిశలు నా తేజము భరింపనెంచి యాహ్వానించెను. కాని యా తేజో విశేష మత్యంతమై నిర్భర మగుటచేఁ గొంతకాలమున కా దశదిశలను మోయఁజాలక వెడలఁగ్రక్కెను. అంత నా దీధితి సముద్రగర్భమునఁ బడెను. ఈ సంగతి బ్రహ్మదేవుఁ డెఱింగి యా ప్రదేశమునకు వచ్చి యా తేజమును దాను ధరించెను. దేవత లిది చూచి యావిరించిని సోమమంత్రములతో స్తుతించిరి. అంత బ్రహ్మ యా తేజోంశమునకుఁ బురుష రూప మొసఁగి యత్రిమహాముని వివాహమైన పిమ్మట నాతని కనసూయయందుఁ దన యంశముచేఁ జంద్రుఁడై జన్మించుననియు నా తేజోంశమే యొకటి తరువాత క్షీరసాగర మథన సమయమున జనించి యా శశాంకునిఁ గలియు ననియు దేవతలకుఁ జెప్పి యా చతుర్ముఖుఁ డంతర్హితుఁడయ్యెను. అత్రి యథాపూర్వము తపో విద్యానవద్యుఁడై బ్రహ్మచారియై యుండెను.[1]

అత్రిమహర్షి వివాహము

కొంత కాలమునకు దేవహూతీకర్దములకు విష్ణుమూర్తి కటాక్షముచేఁ దొమ్మండ్రుకూఁతులును నొక కుమారుఁడును జన్మించిరి.

  1. మార్కండేయపురాణము.