పుట:Maharshula-Charitralu.firstpart.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్త్యమహర్షి

23


తెఱఁగుల స్తుతింప లక్ష్మి యాతనికిఁ బ్రత్యక్షమై "ఋషివరా! నీస్తుతికి సంతసించితిని. నీవు రాఁగల యిరువది తొమ్మిదవ ద్వాపరమున వ్యాసుఁడవై వారణాశిలో వేదశాస్త్ర పురాణసంహితా ధర్మ శాస్త్రముల వక్కాణింపఁగలవు. నీవిపుడు తుంగభద్రా తీరమునకరిగి కిష్కింధ ప్రాంతమునఁగల స్వామిమల యను నడవిలో నున్న కుమారస్వామిని దర్శించి యతని వలనఁ గాశీప్రశస్తిఁ దెలిసికొని యేఁగుము." అని పలికి లోపాముద్ర నాదరించి యామెకు బహువిధములగు దివ్యాభరణము లిచ్చి వీడ్కొలిపెను.

ఇట్లు చరితార్థులైన యా దంపతులు పయనించి పయనించి శ్రీశైలమునఁ జేరిరి. అట నొక్కచోఁ గూర్చున్నతఱి అగస్త్యుఁడు లోపాముద్రకు శ్రీశైల మహత్త్వముం దెలిపి యా పర్వతశిఖరమును జూచినంతమాత్రనే ముక్తి కలుగునని చెప్పెను. అంత నామె చనవు బలిమిని “నాథా ! ఈ శిఖరముఁ జూచినంతనే ముక్తి కలుగుచుండఁగా నిఁకఁ జచ్చినఁగాని మోక్షము లేని కాశి కేఁగు టెందులకు?" అని పలికెను.

లోపాముద్రాగస్త్య సంవాదము

మఱియు నామె "దేవా! కొందఱు కేవల విజ్ఞానముచాలు నందురు. కొందఱు విజ్ఞానసహితమైనకర్మ ముఖ్యమందురు. వ్రతదాన క్రతుయోగములు, తపోబ్రహ్మచర్యగార్హస్థ్య వానప్రస్థ సన్న్యాసాశ్రమములు, వేని కవియే ముక్తి ప్రదములందురు. వీనియన్నిటిలో సులభముక్తిమార్గము సెలవీయుఁ" డని కోరెను. అగస్త్యుఁడామె కిట్లు .బదులు చెప్పెను. “సాధ్వీ ! శ్రీశైలాదులన్నియు ముక్తి ప్రదములే ఏలన, నివి కాళీప్రాప్తికరము లగుటవలన. ఇఁకఁగాశియే సాక్షాన్ముక్తి హేతువు, అందుచే నది గొప్పది. ప్రయాగ. నైమిశము, కురుక్షేత్రము, గంగాద్వారము, అవంతిక , అయోధ్య, మధుర,