పుట:Maharshula-Charitralu.firstpart.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

మహర్షుల చరిత్రలు


వెంటనే యత్యుగ్రాహివి కమ్మని శాపమిచ్చెను. తత్క్షణమే నహుషుఁడు శక్రాసనమునుబాసి క్రూరసర్పమై వచ్చుచు నగస్త్యుని పాదములపైఁబడి "మహాత్మా! క్షమింపుము. నే సెంతయుఁ బశ్చాత్తప్తుఁడ నై తిని. బలవద్విధి వైపరీత్యముఁ దప్పింప నేరితరము? కావలసినదైనది. కావున నాకుఁ బూర్వస్మృతి చెడకుండను. బలవంతములగు జంతువులు నన్ను ముట్టి బలహీనము లగునట్లును, శాపమోక్షమున కుపాయమును బ్రసాదింపు" మని కృతాంజలియై వేఁడుకొనెను. అగస్త్యుఁడు వెంటనే కరుణించి యాతనివరము లనుగ్రహించెను. ఆహా! మన మహర్షులెంత దయార్ద్ర హృదయులో కదా! పరమ బ్రహ్మర్షుల నవమానించిన దుష్కృతమునకు ఘోర శాపమిచ్చి నహుషుని దౌష్ట్యమును బోఁద్రోలిన యగస్త్యమహర్షి పశ్చాత్తప్తుఁ డైన యానహుషునే వరమున ననుగ్రహించుట యాతని యనంత మహత్త్వమును జాటుచున్నది. ఇట్టి పవిత్రాత్ములగు మహాశక్తిసంపన్నులఁ గడుపారఁగన్న భారతవర్ష మెంత పవిత్ర మైనదోకదా!

ఆగస్త్యమహర్షి ద్వాదశ వార్షికయజ్ఞము

ఒకానొకప్పు డగస్త్యమహర్షి ద్వాదశవార్షికయజ్ఞ, మారంభించెను. ఈ మహాయజ్ఞము పండ్రెండు సంవత్సరములు జరిగెను. ఆ యజ్ఞమువ దివ్యానుభావముగల పరమ మునులు ఋత్విజులై నిజప్రౌడి సఖిలతంత్రములు నడుపుచుండిరి. కాని, కొండొక కారణమున నింద్రుఁడు వర్షింపకుండెను. ఓషధులు వికలత్వము నందెను. ఇది చూచి మునీశ్వరు లగస్త్యుని యన్నదానవిధి యెట్లు నెఱవేఱునో యని భయపడఁ దొడఁగిరి. న్యాయసమ్మతమైన ద్రవ్యమును గాని యొండు ద్రవ్యముల నాతఁడు వినియోగింపఁడుకదా! మఱి వానలు లేనిచో మునుల కెట్లీతఁడు భోజనము పెట్టఁగలఁడని వారు సంశయించిరి. అగస్త్యమహర్షి యిది యెఱిఁగి యింద్రుఁడు