పుట:Maharshula-Charitralu.firstpart.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

మహర్షుల చరిత్రలు


నన్నుఁ బరిణయమాడు” మని యడిగెను. కవేరకన్య "తేజోనిధీ! నాకంతటి భాగ్యమే కలిగినఁ గావలసినదేమి? ఇంతకును దాము లోపాముద్రా పరిపూర్ణ పార్శ్వులుగదా? ఇక నా కెటఁ దావున్నది? అదియునుగాక నే ననతికాలముననే నదినై పోవుచున్నాను. నావలన దమకెట్టిసుఖము గల్గు?" నని యడిగెను. ఆగస్త్యుఁడు “ కాంతామణీ ! లోపాముద్ర నీ యంశముచేతనే జనించినది. కావున నందు సంశయింపఁ బనిలేదు. ఇఁక నీవు నదివై నను నీ పత్నీత్వము నాకాంక్షితమే " యని బదులు చెప్పెను. కవేరతనయ యనుమతించి యగస్త్యుని వివాహమైన వెంటనే నది యయ్యెను. అగస్త్యుఁ డామెను దన మండలువుస నుంచుకొనెను. ఈ కవేరతనయయే తరువాతఁ గొంత కాలమునకు వింధ్యగర్వాపహరణార్ధ మగస్త్యుఁడు పోవుచుఁ దన కమండలువును శిష్యులఁ గొని తెమ్మని చెప్పి పోఁగా సహ్యపర్వత సమీపమున నగస్త్యుఁడు లేకుండుటఁ జూచి తనకార్యము జ్ఞప్తికి రాఁగా నామె నదియై నేలపైఁబడి ప్రవహించి పోయెను. ఈ నదియే కావేరీనది. ఈ నదియందు స్నానము చేయుటతోడనే కవేరరాజర్షి సద్యోముక్తి నందెను.[1]

ఆగస్త్యుఁడు సముద్రోదకము నాపోశనించుట

కృతయుగమున నొకప్పుడు వృత్రుఁడను రాక్షసుఁడు కాలకేయాదులతోఁ గలసి యింద్రుని జయించి వేల్పుల బాధించుచుండఁగా వారు బ్రహ్మకడ కేఁగి మొఱవెట్టుకొనిరి. బ్రహ్మవారితో దధీచికడ కేఁగి యాతని యస్థులఁగొని వృత్రు నింద్రుఁడు జయించునని తెల్పఁగా సరస్వతీతీరమున కరిగి వారు దధీచిని బ్రార్దించిరి. దధీచి దేవహితార్ధమై ప్రాణములు విడువఁగా నాతని యస్థులను దేవత లాయుధములుగా గ్రహించిరి. త్వష్ట యిచ్చిన వజ్రాయుధముచే నింద్రుఁడు వృత్రుని జంపెను కాని, కాలకేయగణములు పగలెల్ల సముద్రములో దాఁగి

  1. స్కాందపురాణము - తులాకావేరీ మాహాత్మ్యము.