పుట:Maharshula-Charitralu.firstpart.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దుర్వాసో మహర్షి

145


ఘోరావమానమునకుఁ బాత్రుఁడవై ఖేదము ననుభవింతువుగాక" అని దుర్వాసుని శపించి వెడలిపోయెను. దుర్వాసుఁడు చేయునది లేక కానున్నది కాక మానదని తనదారిం బోయెను.[1]

దుర్వాసుఁ డంబరీషునికడఁ బరీభవింపఁ బడుట

కొంతకాలమునకు దుర్వాసుఁడు సంచారము చేయుచు నాభాగుని కుమారుఁ డగు నంబరీషునింట కేఁగి యాతిథ్యము కోరెను భక్తవరిష్ఠుఁడగు నంబరీషుఁడు మహాప్రసాద మని యాతని శిష్య సమేతముగా స్నానముచేసి రమ్మని కోరెను. దుర్వాసుఁడు శిష్యులతో నదీస్నానమున కేఁగి యెంతకును దిరిగి రాకుండుటచే ద్వాదశీ వ్రత నిష్ఠుఁడగు నంబరీషుఁడు బ్రాహ్మణానుమతి నుదకపానముచేసి యుండెను. అంత దుర్వాసుఁడు నశిష్యుఁడై వచ్చి తాను రాకుండ నుదకపానము చేసిన యంబరీషుని శిక్షింపఁ దనజటలనుండి యొక కృత్యను మంత్రించి పం పెను. భక్త భాందవుఁడగు విష్ణు నంబరీషుని గాపాడఁ దనచక్రము నం పెను. ఆ చక్ర మాకృత్యను రూపుమాపి దుర్వాసుని మీఁదకు రాఁగాఁ నాతఁడు పాఱిపోయి శివుని శరణుజొచ్చెను. ఆతఁడు తా నేమియుఁ జేయఁజాల ననెను. దుర్వాసుఁడు విష్ణుమూర్తికడ కేఁగి శరణువేఁడ నాతఁ డంబరీషునే శరణు గోరుమని సూచింప దుర్వాసుఁడు పరుగున వచ్చి యంబరీషుని శరణువేఁడ నాతఁడు విష్ణుచక్రమును బ్రార్థింప నది యదృశ్య మయ్యెను. దుర్వాసుఁ డౌర్వుని శాపమూలమున నీ ఖేదము గల్గినదని చెప్పి యంబరీషు నభినందించి వెడలిపోయెను.[2]

దుర్వాసుఁడు శబరతావసుని బరీక్షించి వరము లొసంగుట

తొల్లి యొక శబరతావసుఁ డడవిలో మహాతపము చేయుచుండ దుర్వాసుఁ డచటి కేతెంచెను. ఆ ఖిల్లుఁ డాతని నెంతయుఁ

  1. బ్రహ్మవైవర్తపురాణము.
  2. భాగవతము.