పుట:Maharshula-Charitralu.firstpart.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దధీచి మహర్షి

137


దధీచికిఁ బిప్పలాదుఁ డుద్భవించిన విధము

దధీచి మహర్షి చనిపోవుసరి కాతనిభార్య సువర్చ గర్భవతి యై' యుండెను. భర్తమరణము వినఁగానే యా మహాసాధ్వి సహగమనమునకై చితి నెక్కెను. అంతలో బ్రహ్మాదులు ప్రత్యక్షమై “సాధ్వీ నీ గర్భమున మహాత్ముఁ డగు బాలుఁడున్నాడు కావునఁ బ్రాణత్యాగము చేయకు" మని పల్కిరి సువర్చ "దేవతలారా ! మీ వర్తనము చూడఁ జిత్రముగ నున్నది. నా భర్తను జంపితిరి. సాధ్వినగు నాకు వైధవ్యదుఃఖము నిచ్చుట కిట్లు పన్ను చుంటిరా ? నా భర్తను జంపిన దేవతలు పశువులై ప్రవర్తింతురు గాక " యని శపించి భర్త చితి నెక్కెను. అంతలో నామె గర్భమునుండి యొక బాలుఁడు జాఱి సమీపముననున్న పిప్పలవృక్షము కడఁ బడెను. ఆమే చితిలో భస్మమైపోయెను

అట్లు జనించి పిప్పలవృక్షముక్రిందఁ బెరిఁగిన బాలుఁడే పిప్పలాద మహర్షి , పిప్పలవృక్ష మాతనిపై జాలిగొని చంద్రునర్థించి యమృతముఁ గొనివచ్చి యా బాలునికిఁ బోయఁగా నాతఁ డాఁకలి దప్పు లెఱుఁగక చక్కఁగాఁ బెరిఁ గెను. ఆ కారణముననే యాతనికిఁ బిప్పలుఁ డను పేరు కలిగెను. ఈతఁడు పెరిగి పెద్దవాఁడై తన తండ్రి మరణమునకుఁ గారకులైన దేవతలఁ జంప నెంచి యీశ్వరుని గుఱించి తపస్సు చేసెను. ఆతఁడు ప్రత్యక్షమై దేవతలను జంప సమర్థమగు కృత్యమ బంపెను. దేవతలు శివుని శరణు వేఁడఁగా శివుఁడును బిప్పలాదునిఁ బ్రార్థించి దేవతావధోద్యోగమును విరమింపఁ జేసి యా పిప్పలాదునికిఁ బితృలోకమునఁ దలిదండ్రులను జూడఁ గలుగు వరమిచ్చి యదృశ్యుఁ డయ్యెను. పిప్పలాదుఁ డిట్లు దధీచి మహర్షికిఁ బుట్టి యారీతి మహర్షియై వెలుగొందెను.[1]



  1. స్కాందపురాణము. మాహేశ్వరఖండము, కేదారము.