పుట:Maharshula-Charitralu.firstpart.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

మహర్షుల చరిత్రలు


విడిచివేయుదును. నా యస్థులే శతాధిక బలసంపన్నములగు మీ యాయుధము లగును. విచారము దక్కిపొం" డని పల్కెను. దేవత లాతని జగద్దితమతికి మెచ్చి నమస్కరించి యానందములో వెడలిపోయిరి.

దధీచి దేవకార్యమునకై దేహము త్యజించుట

మఱి యొకప్పుడు వృత్రాసురుఁడు సహచరాసురులతో విజృంభించి దేవతలకు మహాపద సంభవింపఁ జేసెను. ఆతని నెట్లును జయింపశక్తి లేక దేవత లందఱు బ్రహ్మకడ కేఁగి ప్రార్థించిరి. ఆతఁడును దనశక్తిహీనతఁ దెల్సి “ఇఁక మీరు దధీచిని బ్రార్ధించి యాతనియస్థులు గైకొని వాని నాయుధములుగా నుపయోగించినచో మీ రీయసురులఁ జంపఁ గల్గుదురు. అంతకు మించి మార్గాంతరము లేదు. కనుక , పోయి యాతనిఁ బార్డింపుఁ"డని వారిని బంపివేసెను. దేవతలు దధీచి వాగ్దానము జ్ఞప్తికిఁ దెచ్చుకొని యాతనికడ కేఁగి యాతనితోఁ దమ దుస్థ్సితిని దెల్పుకొని సంరక్షింప వేఁడుకొనిరి.

దధీచి తన భౌతిక దేహమును విసర్జించి దేవహితము చేయుటకంటె వలసినది లే దని నిశ్చయించుకొని " దేవతలారా ! మీరు నన్ను వెంటనే చంపి నా యస్థులు కొనిపోవచ్చు" నని యాహ్వానించెను ఇంద్రాదులు భయకంపితులై "మహాత్మా! నిన్నుఁ జంపుశక్తి మాకడ లేదు. బ్రహ్మ హత్యాదోషముమాట యటుండ నిమ్ము. నీకు స్వచ్ఛందమరణ మీశ్వరుఁ డనుగ్రహించియుండుట నొరు లెవ్వరు నిన్ను జంపఁ జాల" రని పల్కిరి దధీచి “ఐనచో యోగాన్నిఁ గల్పించుకొని నేను మరణింతును. మీ కర్తవ్యమును మీరు నిర్వర్తించుకొనుఁ" డని యోగాగ్నిఁ గల్పించుకొని పరబ్రహ్నాను సంధానమున దేహముఁ ద్యజించి పరమశివునిలో నైక్యమయ్యెను. దేవతలు గోగణమును బ్రార్థించి వానిచేఁ బరిశుద్ధము చేయఁబడిన దధీచి యస్థులనే బ్రహ్మ చక్రము, వజ్రాయుధము మున్నగు నాయుధములు చేసికొని యసురులను నిర్జించిరి.[1]

  1. స్కాందపురాణము, బ్రహ్మపురాణము, శివపురాణము.