పుట:Maharshula-Charitralu.firstpart.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

మహర్షుల చరిత్రలు


మంపెను. దధీచి యానందించి శిష్యప్రశిష్యుఁడై దక్షాధ్వరమునకు బయలుదేఱి వెళ్ళెను. దక్షుఁడు శివభక్తాగ్ర గణ్యుఁడగు దధీచియుఁ దన యజ్ఞమునకు వచ్చుట తనకు వెఱచియే యని యానందించి యాతని కుపచారములు సల్పి "మిత్రమా! శివుఁడును శివానుచరులును రాకుండఁజేసి నేను యజ్ఞము చేయ నిశ్చయించితిని. జగద్రోహి యగు శివుని బిలువకుండుట నీకును సంతోష మైనచో నిటనుండి యజ్ఞము నిర్వర్తింపు” మని పల్కెను. దధీచి తోకద్రొక్కిన త్రాఁచువలె లేచి వసిష్ఠవామదేవవ్యాసనారదాదిమహర్షు లెల్లరు రాకుండుట కదియే కారణ మని యెఱిఁగి "ఓ దక్షప్రజాపతీ! నీకీ దుర్బుద్దీ యేల పుట్టినది? విశ్వేశ్వరుఁడు, దేవాదిదేవుఁడునగు శివుఁడు లేనిదే యజ్ఞ మెట్లు జరుగును? జరిగినను నీకు ఆభించు ఫలిత మేముండు?" నని శివు ననేకవిధములఁ బ్రస్తుతింప మొదలిడెను. దక్షుఁడు శివుఁడు శ్మశానవాసి, దిగంబరుఁడు, గజచర్మధరుఁడు, బిచ్చగాఁడు, శశశృంగుఁడు నని యనేకవిధముల దూషించెను. దధీచి సభాసదు లెల్లరు వినుచుండఁగా మహాప్రశాంతుఁడై వానికన్నిటికిని సముచితముగా బదులుచెప్పి పరమశివుని ప్రఖ్యాతిని బలువిధముల విస్తరించి చెప్పెను. ఎన్ని చెప్పినను దక్షుఁడు లెక్కచేయక "ఆ నిర్బాగ్యుని నుతించువార లొక్క నిమేష మైన నిటనిల్వ రా"దని యాజ్ఞాపించి దధీచి నవమానించెను. దధీచి శిష్యసహితుఁడై లేచి "ఓ దక్షనామక మూర్ఖాగ్రేసరా ! నే నెన్ని చెప్పినను వినక సదాశివుని దూషించితివి. కావున, నీ యజ్ఞ మశుభప్రతిపాదక మగుఁగాక ! నీవును దగిన ప్రాయశ్చిత్తము నందుదువు గాక ! వివేకవిహీనుఁడవై నీవు చేయ జన్నమునకు వచ్చిన యీ దేవఋషిగణ మెల్ల వినాశము నందుఁ గాక ! యని శపించి యజ్ఞ వాటమునుండి వెడలిపోయెను. ఈతని శాపప్రకార మచిరకాలముననే వీరభద్రునిచే దక్షాధ్వర ధ్వంసము సదస్యవినాశనము కలిగెను.