పుట:Maharshula-Charitralu.firstpart.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

మహర్షుల చరిత్రలు


బ్రయోగించి దధీచి శరీరమును ముక్కముక్కలుగాఁ జేసెను. అంత దధీచి మరణించెను. దధీచి భార్గవవంశజుఁ డగుటచే శుక్రాచార్యుఁడు జాలిగొని యచటికి వచ్చి దధీచి దేహశకలము లన్నిటిఁ జేర్చి తన సంజీవనీ మంత్రప్రభావమున నాతనిని క్షణములో బ్రతికించెను. దధీచి నిద్రనుండి లేచినట్లు లేచి భార్గవునకు వందన సహస్రము లాచరించెను. శుక్రుఁడు దధీచి, గౌఁగిలించుకొని"వత్సా! నీవు సర్వశక్తి సంపన్నుఁడ వగుదువు సదాశివునిఁగూర్చి తపము చేయు" మని దీవించి యంతర్హితుఁడయ్యెను.

దధీచి క్షుపుని విష్ణుని నిందించి గెల్చుట

దధీచి యటనుండి లేచిపోయి యాశ్రమమున కేఁగి పరమశివుని గుఱించి తపముచేయ మొదలిడెను. నిరాహారుఁడై నిర్జితేంద్రియుఁడై దధీచి మహర్షి తపస్సు చేయుచుండఁగా ముల్లోకములు గగ్గోలు పడుచుండెను. ఈశ్వరుఁడు నతనితపోన వధ్యతకు మెచ్చి ప్రత్యక్ష మై దధీచికి స్వచ్ఛంద మరణము. వజ్రమయశరీరము లోకత్రయ విజయశక్తి నిచ్చి యదృశ్యమయ్యెను. దధీచి మహావరసంపన్నుఁడై యుండియు క్షుపుఁడు తనకుఁ జేసియున్న యవమానము బ్రాహ్మణ నింద మఱవఁజాలక యాతని గృహమున కేఁగి క్షుపు నొక తన్నుఁ దన్నెను. క్షుపుఁడు మహాకోపముతో దధీచి నెన్ని యో విధముల హింసింపఁ జూచి బహుశస్త్రాస్త్రములఁ బ్రయోగించిన నవి విఫలమయ్యెను. అంత దధీచి " ఓరీ! క్షత్త్రియాధముఁడ వగు నీ వెక్కడ? బ్రాహ్మణశ్రేష్ఠుఁడ నగు నే నెక్కడ ? బ్రాహ్మణుఁడధికుఁ డగునో కాదో తెలిసినదా? నీవు కాదు. నీ దేవుఁడగు విష్ణువుకూడ నా కాలి గోటికి సరికాఁడు గ్రహింపు" మని గర్వించి పల్కెను. క్షుపుఁడు చేయునదిలేక , విష్ణుమూర్తిని గుఱించి తపస్సు చేయఁగా నాతఁడు ప్రత్యక్షమయ్యెను. క్షుపుఁడు తనకు దధీచివలనఁ గల్గిన యవమానమును దధీచి విష్ణుని లెక్క సేయక పోవుటయుఁ దెల్పి రక్షింపుమని కోరెను.