పుట:Maharshula-Charitralu.firstpart.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

మహర్షుల చరిత్రలు


సురక్షితముగా నుండెను. కార్తవీర్యార్జునుఁడు రిక్తహస్తములతో నింటికిఁ బోయెను. రేణుకాదేవి భర్తతో సహగమనము చేయనుండ నాకాశవాణి వలదని వారించెను. ఇంతలో భృగుమహర్షి వచ్చి జమదగ్నిని బ్రతికించెను.

తరువాతఁ బరశురాముఁడు వచ్చి జరిగినసంగతిఁ దెలిసికొని యింటఁ దిని యింటివాసములు లెక్క పెట్టినట్లున్నదని కోపించి కార్తవీర్యు నవమానింపఁ దండ్రియనుమతిఁ గొని కుశారకవచకోదండ కాండుఁడై మాహిష్మతీపురమున కేఁగెను. అందుఁ గార్తవీర్యార్జునుఁడు నాతని సంహరింపుఁ డని దండనాయకులఁ బదియేడక్షౌహిణులఁ బంపెను. పరశురాముఁ డొక్కక్షణమున వారి నందఱు రూపుమాపెను. కార్తవీర్యార్జునుఁడు యుద్ధమునకు రాఁగా నాతని వేయి చేతులను ద్రుంచి తనగండ్రగొడ్డలిచే నాతనిశిరముఁ దునిమెను పిమ్మట నాశ్రమమున కేఁగి యాతఁడు తండ్రికి జరిగిన వృత్తాంతముఁ జెప్పెను. జమదగ్ని మహర్షి రాజెంత దుష్టుఁడైన నాతనిఁ జంపుట దోషమనియుఁ దద్దోషపరిహారమున కొకయేఁడు తీర్థయాత్ర గావింపు మనియుఁ బుత్త్రుని శాసించెను. పరుశురాముఁ డట్లే యని తీర్థయాత్రకై బయలు వెడలిపోయెను. ఆహా! తన కుమారుఁడు విష్ణుస్వరూపుఁ డని యెఱిఁగియుఁ గార్తవీర్యుడుఁ దనకుఁ బరమవిరోధియై యున్నను, నాతనిఁ జంపిన కారణమున ధర్మసంహితబుద్ధితోఁ బుత్త్రుని శిక్షింప వెనుకంజవేయని జమదగ్ని మహర్షి నెంతకొనియాడినను దనివి తీరదు కదా!

కార్తవీర్యార్జునుని కొడుకులు కొంతకాలమునకు దమ తండ్రిని జంపుటకుఁ గారకుఁడు జమదగ్నియే యని యొక్కసారి జమదగ్ని హోమగృహముఁ జేరి యాతనిఁ బట్టి చంపిరి. రేణుకాదేవి యాతనిపైఁ బడి "పరశురామా! వచ్చి తండ్రిని రక్షింపుము, రక్షింపు" మని యిరువదియొక్కసారి కేకవేసెను. అంతలోఁ దీర్ధయాత్రనుండి