పుట:Maharshula-Charitralu.firstpart.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జమదగ్ని మహర్షి

115


స్యాలకులచేతను హతతేజుఁడ వగుదువు. మాలి సుమాలి యుద్ధమున శివుఁడు నిన్ను జయించును " అని చెప్పి జమదగ్నిం జూచి “మహాశయా | పరాజయలజ్జితుఁడైన సూర్యునింతతో విడువుము నీ తేజమున క్షణమాత్రములో జగమంతయు భస్మీభూతము కాఁగల దనుట నిజము నీవును సూర్యుఁడును బరస్పరపాల్యులు, పూజ్యులును, నీవు కార్తవీర్యున చేఁ బరాభవము, ఓటమి, మరణము నందుదువు. ఐనను విష్ణుమూర్తి నీకు సుతుఁడై జన్మించి ముయ్యేడుమాఱులు శోధించి జగమంతయు నిఃక్షత్త్రము గావించుచు, నీ మరణము లోకకల్యాణ బీజమే కాఁగల"దని చెప్పి యదృశ్యుఁడయ్యెను. జమదగ్నియు సూర్యుఁడును బరస్పరమభినందించుకొని పురాకృత కర్మముల నివారింప సమర్థుఁడెవ్వఁ డనుకొని నిజ గృహముల కరిగిరి.[1]

రేణుకాదేవి భర్తకుఁ బరమభక్తితో సేవచేయుచు నాతని కటాక్షమునఁ గ్రమముగా నైదుగురు కుమారులంగనెను. వారు వరుసగా రుమణ్వతుఁడు, సుసేషణుఁడు, వసువు, విశ్వావసువు, పరశురాముఁడు నను నామములఁ దాల్చిరి. పరశురాముఁడు విష్ణునవతారమై జన్మించెను. ఇట్లు జనించిన పుత్త్రులం బెంచుకొనుచు భర్త శుశ్రూష యేమఱక రేణుకాదేవి చరించుచుండెను.

పరశురాముని పితృభక్తి

ఒకనాఁడు రేణుకాదేవి జలమునకై యేటికిఁ బోయెను. అందుఁ జిత్రరథుఁ డను రాజు భార్యాసహితుఁడై జలక్రీడా పరవశుఁడై యుండెను. వారినిఁ జూచుసరికి రేణుకాదేవి విధివశమున వారి క్రీడలపైఁ గోరిక జనింపఁగ నట నిలిచి వారి యానందమును గాంచు చుండెను. ఆ కారణమున నామె మహోత్తమ పాతివ్రత్యమున

  1. బ్రహ్మవైవర్తపురాణము. ఉపావద్దాప విషయకమగు సూర్య జమదగ్ని సంవాదము భారతానుశాసనిక పర్వమునఁ గలదు.