పుట:Maharshula-Charitralu.firstpart.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

మహర్షుల చరిత్రలు


గాంచఁడు. నీవు కర్మ సాక్షి నని ఫలప్రదాత నని శాస్తనని గర్వించి నన్నాక్షేపింప వచ్చితివి. తపోధనవిరాజితులము, జ్ఞానమూర్తులము నగు మాకు నారాయణుఁడు సంరక్షకుఁడు, మా భావము లాతఁ డెఱుఁగును. మేమాతని నెఱుఁగుదుము. మ మ్మొరులు బోధింప శిక్షింప సమర్థులు కారు. నీవే కాదు బ్రహ్మ రుద్రయమాదులైన మమ్ము శిక్షింపలేరు. అట్టి మాకు నీవు రతి భంగ మొనరించితివి కాన, నా శాపమున రాహుగ్రస్తుఁడవై పాపదృశ్యుఁడవు హతతేజుఁడవు నగుదువు" అని శపించెను.

సూర్యుఁ డది విని "అయ్యా ! మనము పరస్పరము పూజ్యులము. ఐనను. నీవు నన్ను శపించితివి నే నూరకున్నచో లోకులు నన్నశక్తుఁ డని నిస్తేజుఁ డని నిందింతురు. కావున ఒక క్షత్త్రియునిచే నీకుఁ బరాభవము, ఆతని యాయుధముచే మరణము గల్గఁగల"దని ప్రతిశాపమిచ్చెను.

అపుడు జమదగ్ని మరలఁ గోపించి నీవు శివునిచే జితుండవగుదు వని మరల శపించెను. ఈ సంగతి కశ్యపునివల్ల నెఱంగి బ్రహ్మ యాతనితోఁ గూడ క్షణములో సూర్య జమదగ్నులకడ కరుదెంచి వారిని శాంతపఱిచి సూర్యునితో "ఓయీ! నీవు ఒకానొక దినమునందాకాశమున మేఘచ్ఛన్నుఁడవై వెంటనే ముక్తుఁడవయ్యెదవు. మేఘాతిశయ కాలమునఁగాని వర్షంబునంగాని రాహుగ్రస్తుఁడ వయ్యెదవు. ఐనను, కొందఱి కదృశ్యుఁడవు. కొందఱికిఁ బూర్ణదృశ్యు డవుఁ నగుదువు నిన్నుఁజూచి సమస్కరించి సర్వజనులు పాపహీను లగుదురు. జన్మసప్తాష్టమ, చతుర్థ దశమస్థానంబులందు, జన్మ ఋషనిధనములందును నీవును జంద్రుఁడు సదృశ్యులయ్యెదరు. అస్తకాల, ఘనాచ్ఛన్న కాల మధ్యాహ్న కాలములందు, జలములందు అర్దోదిత కాలములందు నీవు ఉపదృశ్యుఁడ నగుదువు. భార్యాదుఃఖనిమిత్తమునఁ గారణభూతయైన భార్యచేతను శ్వశుర