పుట:Maharshula-Charitralu.firstpart.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

107


జూచి సంతసముతో భక్తిభరితులై మరల నాతని పాదము లొత్తు చుండిరి. అతఁడును మఱి యిరువదొక్క దినము లట్లే కడపెను. పిమ్మట నాఁడు తైలాభ్యంగము కావలె నని చ్యవనుఁడనిన రాజు తై లాభ్యంగము చేయించుచుండ నాతఁ డంతర్హితుఁడై యపరాహ్ణము దాఁటిన పిదప వచ్చి స్నానము చేసెను, కుశినాభుఁడు భార్యయుఁ జలింపక వివిధాన్న పానములు ఘటించి భోజనమునకు రమ్మనఁగాఁ దిరిగి యాతఁ డంతర్హితుఁడయ్యెను. రాజును భార్యయు భుజింప నొల్లక యాతనికొఱ కెదురుచూచుచుండ మఱునాఁ డుదయ మాతఁడు వచ్చి కుశినాభునితో "నీవును నీభార్యయు నే నెక్కిన రథమును లాగుఁ" డనెను. వా రంగీకరించి యట్లు చేయఁగా రక్తములు కాఱునట్లు వారి నాతఁడు బాధించెను. ఐనను, వారు చలింపలేదు. చ్యవనుఁడు దయతో వారిని స్పృశించినంతనే వారి కాయాసము పోయెను; నవయౌవనము కలిగెను. చ్యవనుఁడు వారినింటికిఁ బోయి మఱునాడు తాను గంగాతీరమునఁ జేయు యజ్ఞమునకు రండని పిలిచి పంపి వేసెను.

కుశికభూపతి యింటి కరిగి విధ్యుక్తముగాఁ గర్మములు నిర్వర్తించి మఱునాఁడు స్నానాదు లోనరించి భక్తిభరిత హృదయముతో భార్యాసమేతుఁడై చ్యవననిర్దిష్ట ప్రదేశమున కరిగెను. అందు మణిమయ దివ్య హర్మ్యములు నిర్మితములై యుండెను. మండపములు, ఆరామములు, పద్మాకరములు, క్రీడాచలములు, సురకిన్నర గంధర్వగణములు గానవచ్చెను. అందొక దివ్యభవనమున భార్యాభర్తలు చ్యవనునిఁ గాంచిరి. వెంటనే యాతఁడు మేడలతో నంతర్థాన మయ్యెను. కొంతసేపటికి వారి నిరువురఁ బిలిచి చ్యవనుఁడు "రాజా! నీ మనస్సు నింద్రియములు నీ కింత స్వాధీనముగ నుండుట స్వల్పవిషయము కాదు. నా కానందమైనది. నాఁడు నీయింటఁ జరియించుచు నా రీతిఁ బ్రవర్తించుటకుఁ గల కారణము నీయందుఁ