పుట:Maharshula-Charitralu.firstpart.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

మహర్షుల చరిత్రలు


డట్లేయని చ్యవనునకుఁ దెలుప నాతఁ డానందించి గోప్రభావము: నాతని కుపన్యసించెను. ఒక గోవును దీసికొని వచ్చి సహుషుఁడు జాలరుల కీయ వారు దానిని చ్యవన మహర్షి కే యిచ్చి తమ్ముఁ గృతార్థులఁ జేయుమని కోరుకొనిరి. చ్యవను డంగీకరించి యా చేఁపలకు నా జాలరులకును స్వర్లోకము కలుగునట్లు వరమిచ్చెను. వెంటనే వారు దివ్య విమానారూఢులై స్వర్గమున కేఁగిరి. నహుషునిఁ జూచి యాతనికి ధర్మపరత్వము నింద్రపదవి కలుగునట్లు చ్యవనమహర్షి యాశీర్వదించి వెడలిపోయెను. చ్యవనమహర్షి యాళీర్వచనముననే సహుషుఁ డొకసారి యింద్రుఁడయ్యెను.

చ్యవనమహర్షి కుశిక భూపతిని బరీక్షించుట

సురలు మునులు సురశ్రేష్ఠునిఁ గొలిచి యుండఁగాఁ బ్రసంగవశమున నొకనాఁడు భృగుకుశిక వంశములకు బహ్మక్షత్త్రములు తడఁబడి సంకరము వాటిల్లునని బ్రహ్మపలికెను. ఇది చ్యవసమహర్షి వినెను. నాఁటినుండి కుశికవంశము నంతరింపఁ జేసినచో సాంకర్యము కలుగదని యాతఁ డెంచుచుండెను. కుశికకులమున కుత్పాత మాపాదింపఁగోరి చ్యవనుఁడొకపర్యాయము కుశికభూపాలుఁడగు కుశినాభునికడ కేఁ గెను. ఆతఁ డీతని నత్యంతము గౌరవించెను. బంధుమిత్త్రపరివారముతోఁ గుశినాభుఁ డీతనికి సేవచేయ మొదలిడెను. చ్యవనుడభ్యంతరమందిరమున హంసతూలికా తల్పమునఁ బరుండి భార్యాభర్తల నిరువురను బాదము లొత్తుఁ డనెను కుశికుఁడు సభార్యుఁడై సేవచేయుచుండఁగా నిరువదియొక్క దినములు చ్యవనుఁడు కదలకుండ నిద్రించెను. కుశికభూపాలుఁడు నాతనిని విడువక సేవించుచునే యుండెను ఇరువదిరెండవ నాఁడు లేచి యెటకో పోవుచుండెను. రాజు భార్యయు వాని సనుసరింపఁ గొంత దూర మేఁగి యాతఁ డదృశ్యుఁడయ్యెను. భార్యాభర్త లిరువురును విచారముతో ఇంటికి వచ్చి చ్యవనుఁడు వేఱొక తల్పమున నుండుటఁ