పుట:Maharshula-Charitralu.firstpart.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

105


కామముతోఁగాక సత్పుత్త్రజనకు లగుట కేకదా నిజపత్నీ సమాగమము నభిలషించుట ! అట్టిసంగమమున మహాత్ములు కాక యన్యు లుదయింపరుగదా!

చ్యవనుఁడు నహుషు ననుగ్రహించుట

చిరకాలము గృహస్థధర్మములు నడపి చ్యవనమహర్షి యొకప్పుడు భాగీరథీయము నాసంగమమున సుస్థిరుఁడై యధిక నిష్ఠతో నుదకవాసమహావ్రత మారంభించి నీటిలో నుండి తపము చేయుచుండెను. అందలి మత్స్యము లాతనిచుట్టును దిరుగుచుండఁగా నాతనికి వానిపై గృపయుఁ బ్రేమమును జనించెను ఆప్రకార మాతఁడందుఁ బండ్రెండు సంవత్సరము లుండెను. ఆతఁడు సకల భూతములందును బరమశుభమగు విశ్వాసము గలిగి శుచియై దేవతా పురస్సరముగాఁ దపము చేయుచుండ, నాజలము లాతనికిఁ బ్రదక్షిణ మొనర్చి భక్తిమెయి నే కీడు నొనర్పకుండెను. ఇట్లుండ వొకనాఁడు జాలరులు వలలతో నందలి చేఁపలను బట్టుచు నా మహర్షిని బట్టి గట్టునకు లాగిరి. ఆతనిఁ గాంచిన వెంటనే వారు భయకంపితులై తమతప్పు క్షమింపు మనిరి. చ్యవనమహర్షి యించుకేని గోపపడక “మీ కులవృత్తి మీరు చేయుటలో దోషము లేదు. నన్ను నీమత్స్యములతో పాటు విక్రయించుకొనుఁ" డన వారు పరుగునఁ బోయి తమ రాజగు నహుషునితో నీ విషయ మెల్ల వినిపించిరి. నహుషుఁ డాక్చర్య భక్తిసంభరితుఁడై వచ్చి యా మహర్షికి మ్రొక్కి క్షమింప వేడుకొనెను. చ్యవనుఁడు వారు చేసిన దోష మేమియును లేదనియుఁ దనకు వెల నిర్ణయించి యా జాలరుల కిమ్మనియుఁ గోరెను, సహుషుఁడు నూఱుమాడలీయ నియమించెను. అర్దరాజ్య మిచ్చెద ననెను. రాజ్యమంతయు నిచ్చెద ననెను ఏమనినను దనకుఁ దగిన వెల కాదని చ్యవనుఁ డనెను. ఇంతలోఁ గవిజాతుఁడను ముని వచ్చి గోబ్రాహ్మణులు సమాను లగుట నొక గోవు నిమ్మనెను. సహుషుఁ