పుట:Maharshula-Charitralu.firstpart.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

మహర్షుల చరిత్రలు


ప్రణాముఁడై బయలుదేఱి వైదూర్య పర్వతప్రాంతమున కరిగి యొక సరోవరము పొంత మహాతపోనిష్ఠాగరిష్ఠుఁడై యుండెను. అతఁ డట్లు తపోవృత్తి నుండఁగఁ గొన్ని వేల సంవత్సరములు గడచెను. ఆతఁడును వృద్ధుఁడయ్యెను. దేహమును మఱచి పరమేశ్వరునిపై మనసు లగ్నముచేసి దివ్యానందము నాతఁ డనుభవించుచుండఁగా నాతని దేహము పుట్టలు పెట్టెను. లతాగుల్మము లాపుట్టలపై మొలిచి యల్లుకొనుచుండెను. ఐన, నా చ్యవనునకు దేహస్మృతి లేకుండెను.

చ్యవనుఁడు సుకన్యను వివాహమాడుట

ఇట్లుండఁగా సంయాతి యను నొక రాజు చతుస్సహస్ర దేవీ నివహముతోడను సుకన్య యను కూఁతు తోడను సై న్యసమేతుఁడై యా సరోవరమున జలక్రీడార్ధమై వచ్చి యుండెను. అతనికుమారి చక్కనిచుక్క యగు సుకన్య యువతీజనపరివృతయై యందుఁ దిరుగుచుఁ బుట్టలువోసిన చ్యవనుని కడకు వచ్చెను. ఆ పుట్టలోనుండి చ్యవనుని నేత్రములు ఖద్యోతద్యుతులవలె మెఱయుచుండుటఁ గాంచి సుకన్య యా నేత్రములఁ బొడిచెను. చ్యవనుఁ డిది యెఱిఁగి సంయాతి సైన్యమునకు మూత్రపురీషనిరోధము గావించెను. సంయాతి దానికి కారణ మరయలేక వెఱఁగుపడెను. ఇంతలో సుకన్య తండ్రి కడకు వచ్చి తానొక పుట్టలో రెండు మిడుఁగురులను జూచి పొడిచిన సంగతి చెప్పెను. సంయాతి యట కరిగి యందుఁ దపఃక్లేశత్వగస్థీభూత శరీరుఁడు నతి వృద్ధుఁడు నగు చ్యవనుని జూచి యాతని పాదములపైఁబడి శరణుజొచ్చి తన కూఁతు నపరాధము మన్నింపుమని వేఁడుకొనెను. చ్యవనమహర్షి భవితవ్యము నెఱిఁగి సుకన్యను దనకిచ్చి వివాహము చేసినచో క్షమింతు ననెను. సంయాతి యంగీకరించి కూఁతు నడుగఁగా సుకన్య “తండ్రీ ! ఇంత కన్న నాకుఁ గావలయున దేమున్నది! పరమ తపోధనుఁడగు బహ్మర్షిని భర్తగాఁ బడయు మహాభాగ్యమున మన వంశమును బరమ పవిత్ర మొనరింపఁ