పుట:Maharshula-Charitralu.firstpart.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ్యవన మహర్షి

99


వెఱచియు విప్రశాపముఁ గ్రమ్మఱించుకొనవచ్చిన వచ్చుఁ గాని యసత్యదోషము తీర్పరాని దని నిశ్చయించుకొని యామె భృగుపత్ని యని చెప్పెను. పులోముఁడు వెంటనే వరాహరూపము ధరించి యామె నెత్తుకొని పాఱిపోఁ జొచ్చెను. అపుడామె గర్భము చ్యుతము కాఁగా నొక యర్భకుఁడు బయట పడెను. మాతృగర్భచ్యుతుఁడగుట నాతనికి 'చ్యవనుఁ' డను పేరు కలిగెను. ఆ బాలుని తీవ్ర తేజము చూచినమాత్రముననే పులోముఁడు భస్మీ భూతుఁడై పోయెను.

పులోమ సంతసమున నాబాలు నెత్తుకొని గృహమున కరుదెంచెను. అంతలో భృగుమహర్షి స్నానాదికము నొనర్చి యింటికి వచ్చెను. పులోమ జరిగిన యుదంతమంతయుఁ జెప్పి పతికి బాలునిఁ జూపెను. భృగుమహర్షి యంతఁ దన భార్య నా రక్కసునికిఁ జూపిన యగ్నిపైఁ గోపించి యతిక్రూరుఁడు సర్వభక్షకుఁడగుఁ గాక యని యాతనిని శపించెను. అగ్నిహోత్రుఁ డిది విని కోపించి తన తేజోమూర్తి నుపసంహరించు కొనఁగా బ్రహ్మాదులు భృగుశాప మమోఘమనియు నైన నగ్ని సర్వభక్షకుఁడైనను శుచులలో నత్యంతశుచి, పాత్రులయందుఁ బరమ పాత్రుఁడు బూజ్యులలోఁ బరమ పూజ్యుఁడు వేద చోదిత విధానముల విప్రసహాయుఁడై భువనముల నడపునని వరము లనుగ్రహించి యగ్నికోపముఁబాపి శాంతింపఁజేసిరి.[1]

చ్యవనుని తపోనిరతి

ఈ విధముగా జన్మించిన చ్యవనుఁడు పులోమా మాతృస్తన్యములఁ బెరిఁగి పెద్దవాఁ డగుచుండెను. భృగుమహర్షి తనయునకుపనయ నాదిక మొనర్చి బ్రాహ్మణ ప్రధాన వృత్తియు, జీవిత పరమావధిని సిద్ధింపఁ జేయునదియు నగు తపోవనమునకుఁ గుమారుని మనసు గొలిపి విడిచిపుచ్చెను. చ్యవనుఁడు తల్లి దండ్రులకుఁ గృత

  1. భారతము - ఆదిపర్వము.