పుట:Maharshula-Charitralu.firstpart.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

చ్యవన మహర్షి

భృగుమహర్షి కిఁ బులోమ యసునొక భార్యయుండెను. ఆమె తన శుశ్రూషచేఁ బతి మనస్సును హరించెను. ఒకనాఁడు భృగుమహర్షి యామె కోరిక యడిగెను. పులోమ భర్తకు భక్తిపూర్వకముగా వందనము చేసి "మహాత్మా! మీ సేవాభాగ్యముకన్న నాకుఁ గావలసిన దేదియును లేదు. ఐనను, వంశోద్దారకుఁడు బ్రహ్మర్షి వరేణ్యుఁడు నగు నొకపుత్త్రుని దయచేయుఁ" డని వినయ విధేయతలతోఁ గోరుకొనెను. భృగుమహర్షి యంగీకరించి యామెకు గర్భము నిలిపి యామె కోరికపై నగ్నిహోత్రము సిద్ధము చేయుట, హోమద్రవ్యము లందిచ్చుట మున్నగుపను లామెచేఁ జేయించుకొనుచుండెను.

చ్యవనుఁడు జన్మించి పులోముని భస్మము చేయుట

ఒకనాఁడు యథాపూర్వకముగా నగ్ని హోత్రమును సిద్ధము చేయు మని చెప్పి భృగుమహర్షి స్నానమునకై నదికేఁగెను. పులోమ యగ్ని రగిల్చి జాజ్వల్యమానముగా వెలిఁగించెను. పులోముఁ డను రాక్షసుఁ డొకఁడు చిరకాలమునుండి పులోమను బ్రేమించి యామెను వివాహ మాడుదునని చెప్పుచుండెను. కాని, యామె తలిదండ్రు లామె నాతని కీయక భృగుమహర్షి కిచ్చి వివాహము చేసిరి. నాఁటి నుండియు నవకాశము లభించినపు డీమె నపహరింప నా రాక్షసుఁడు వేచి యుండెను. నాఁ డాతఁడు భృగుమహర్షి లేకుండుటఁ జూచి యామె యున్న యగ్ని గృహమును ప్రవేశించెను. ఆమె పులోమ యగునా కాదా యను సంశయముతో సగ్నిహోత్రు నామె యెవరని యడిగెను. అగ్నిదేవుఁడు విప్రశాపమునకు ససత్యదోషమునకు