పుట:Maharshula-Charitralu.firstpart.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌతమ మహర్షి

93


వెంటనే తనరూప ముపసంహరించుకొని యదృశ్య మయ్యెను. గౌతముఁ డెంతయో ప్రార్థింపఁగా నాతని నిందించిన బ్రాహ్మణులు తనలో స్నానము చేయవచ్చి రనియు, వారి మహాపాపమును దాను భరింపఁ జాల ననియు నామె చెప్పెను. గౌతమమహర్షి పరిపరి విధముల నామెను బ్రార్థించి బ్రాహ్మణులను క్షమింపు మనియుఁ దిరిగి భూమిపైఁ బ్రవహింపు మనియుఁ గోరుకొనెను. గంగ యనుగ్రహించి తిరిగి భువిపై నవతరించెను. ఆ గంగామాతయే గౌతముని మూలమున నవతరించుటచే 'గౌతమి' యనియు, గోవును బ్రతికించుటచే 'గోదావరి' యనియు నలరారు చున్నది.[1]

గౌతముఁ డహల్య కొసఁగిన సంతానము

అహల్యాగౌతము లన్యోన్యముగఁ గాపురము చేయుచుండిరి. అహల్యాసాధ్వి బ్రహ్మర్షి వరుఁ డగు గౌతముని సహధర్మచారిణియై నిజ శుశ్రూషామహత్త్వమున నాథుని యుల్లము రంజిల్లఁ జేయు చుండెను. ఆమె త్రిలోకసుందరి యయ్యుఁ దుచ్ఛకామములకు లోనుగాక పతిసేవయే మహాభాగ్యముగా వెలుఁగొందుచుండెను. ఆ సాధ్వి పాతివ్రత్యమునకు వెఱుఁగొంది యామెఁ దలపోయుటయే యింద్రాదులు సైతము మానుకొనిరి. ఇట్లు పవిత్రహృదయముతోఁ దన్ను సేవించు భార్యను మెచ్చి గౌతముఁడు గృహస్థ ధర్మములోఁ బుత్త్రోత్పాదన ముత్తమవిధి యగుట స్మరించి యహల్యను బిల్చి యొకవరముఁ గోరుకొమ్మనెను. అహల్య కొడుకు ననుగ్రహింప గౌతముని వేఁడుకొనెను. గౌతముఁ డంగీకరించి యామెకుఁ గామవాంఛఁ దీర్ప నామె గర్భిణియై యుక్తకాలమున శతానందుఁడను కుమారుని గనెను. వెంటనే యా బాలుఁడు తపోజీవన మారంభింపఁ దలిదండ్రుల యాజ్ఞ గైకొని వెడలిపోయెను. ఈఁతడే శరద్వంతుఁ డనియుఁ బిలువఁ బడుచు మహాతపస్సంపన్నుఁ డాయెను. కాలక్రమమున నీతని

  1. వరాహపురాణము - బ్రహ్మపురాణము.