పుట:Maharshula-Charitralu.firstpart.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

మహర్షుల చరిత్రలు


గానక కొందఱు శవములనే తినఁ దొడఁగిరి. ఇట్లుండఁగా ననేకులగు ఋషులు బ్రాహ్మణులు గౌతముని కతిథులుగా రాఁ జొచ్చిరి. గౌతమమహర్షి యహల్యా సమేతుఁడై భక్తిపూర్వకముగా నందఱ నాహ్వానించుచుఁ దనదపశ్శక్తి చే నెల్లరకుఁ గడుపునిండఁ గూడును, గట్ట నూతనాంబరములు నిచ్చుచుండెను గౌతమమాహాత్మ్యము దశ దిశల నెఱుకపడఁగా నానాఁటికి జనులు తండోపతండములుగా వచ్చి యహల్యాగౌతముల యాహ్వానముపై వారు చేయు మర్యాదలకు నిర్విణ్ణులై యచటనే భార్యాపుత్త్రాదులతో నివసింపఁ దొడఁగిరి. ఈ ప్రకారము దినదినము జనులు వృద్ధియగుటచే గౌతమమహర్షి యాశ్రమము సహస్ర యోజనాధికము కాఁజొచ్చెను. గౌతమమహర్షి కీర్తి యింద్రలోకమునకుఁ బ్రాకెను. ఇంద్రుఁడు నారదుఁడు మున్నగువారు వచ్చి యహల్యా గౌతముల వితరణమునకు మెచ్చి నారి ననేకవిధముల శ్లాఘించి పోవుచుండిరి. పార్వతీ తనయుఁడగు విఘ్నేశ్వరుఁడు గౌతముని ప్రతిజ్ఞాభంగ మొదవించు ప్రయత్నమున బ్రాహ్మణరూపధారియై వచ్చి యహల్యా గౌతములచే నధిక సత్కారముల నంది యకృతార్థుఁడై యాయాశ్రమముననే యుండెను,

ఆ దినములలో గౌతమాశ్రమము భూలోకస్వర్గమై పోయెను. క్షణక్షణమును బెరుగుచున్న ప్రజాసముదాయమునకు నిరంతరము నహల్యాగౌతము లేలోపమును లేకుండఁ జూచుచుండిరి. యావత్ప్రపంచము నతిథిలోక మయ్యెను. నిజ తపోవనవద్యతచే నంతలోకమున కొక గౌతమమహర్షియే భిక్షాప్రదాత యయ్యెను. క్షణమైన నేమఱ కహల్యాగౌతము లతిథి సేవలో మునిఁగియుండి యెల్లరకు షడ్రసోపేతముగ విందులొనరించుచు నూతనాంబరము లొసంగు చుండఁ బ్రతిపురుషునకుఁ గలలో సైతము గౌతముఁడును బ్రతిస్త్రీకి నహల్యయు "మీకేమి కావలయును? మీకేమికావలయును? దయతో సెలవిం" డనుచున్న ట్లే గానవచ్చుచుండిరి.