పుట:Maharshula-Charitralu.firstpart.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌతమ మహర్షి

89


గౌతమమహర్షి నెమ్మదిగా లేచి యనతిదూరముననే యున్న యొక యుత్తమ గోమాతకుఁ బ్రదక్షిణముచేసి యది భూప్రదక్షిణమునకు సమమే యను శ్రుతివాక్య ప్రమాణబుద్ధితో మఱి యొకపర్యాయ మాగోవుచుట్టును దిరిగి బ్రహ్మకడకు వచ్చి విన్నవించెను. బ్రహ్మ యది సత్యమేయని మిగిలినవారు తిరిగి వచ్చుసరి కహల్యాగౌతముల కిరువురకు దివ్యవైభవముతో నుద్వాహ మొనరించెను. ఇంద్రాది దేవతలును గౌతముని మాహాత్మ్యమునకు మెచ్చి యసూయా పరు లయ్యు నేమియును జేయలేక యహల్యాగౌతముల దాంపత్యమును బహువిధముల నభినందించి వెడలిపోయిరి.[1]

గౌతమమహర్షి క్షామసమయమునఁ బ్రజాసంరక్షణము చేయుట

గౌతమమహర్షి యహల్యాసహితుఁడై దండకావన వాటిక కరిగి మహోగ్రముగ బహుకాలము బ్రహ్మదేవుని గుఱించి తప మొనర్చెను. అంత నాతఁడు ప్రత్యక్షమై గౌతముని కోరిక యడిగెను. అతఁడు. "బ్రహ్మదేవా! నేను విత్తినసస్యము జాములోఁ బరిపాకము నందునట్లు వర మొసంగు "మని వేడుకొనెను. బ్రహ్మ యట్లేయని యంతర్ధానమయ్యెను. పిమ్మట గౌతమమహర్షి యహల్యాసహితుఁడై 'శతశృంగగిరి' కరిగి యొకపర్ణ శాల నిర్మించుకొని యజవరమహత్త్వమున సతిథికోటిని షడ్రసోపేతభుక్తిఁ దనుపుచుండెను.

అహల్యయుఁ బతిశుశ్రూషయం దేమఱక శ్రద్ధాభక్తులతోఁ జరించుచుండెను. గౌతమమహర్షి తపోమహత్త్వముచే నాతఁడు తపముచేయు నాశ్రమము సుభిక్షమై సస్యశ్యామలమై యొప్పుచుండెను. ఇట్లుండఁగా నొకప్పుడొక మహాక్షామము సంభవించెను. ఒక్క గౌతమాశ్రమ భూములుతప్ప భూ భాగమందెల్లడలను బంటలు నశించెను. జనులు క్షుద్భాధాతురులై చనిపోవఁ దొడఁగిరి. ఆహారముఁ

  1. బ్రహ్మాండపురాణము.