పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

మహర్షి దేవేంద్రనాధ రాకూర్ స్వీయచరిత్రము.


“సకలజీవులకును దాతవు నీవన్న సంగతి నేనెన్నడును మరువకుందును గాక ! " పిమ్మట మరల కాలినడక ప్రారంభించితిని. వనాంతమున నొక గ్రామమును సమీపించితిని. మరియొక సారి యచ్చట పక్వగోధు మాది క్షేత్రముల జూచి ప్రహృష్టాంతరంగుడ నైతిని. మధ్యమధ్య గసగసా*[1] పొలములుండెను. ఒకచో స్త్రీలు ప్రసన్న భానము, పక్వ సస్యముల గోయుచుండిరి. మరియొక చో కృషకులు భావిఫలా పేక్షతో పొలముల దున్నుచుండిరి. ఎండగా నుండుటచే తిరిగి సవారీ యెక్కి పోయి మధ్యాహ్న సమయమునకు 'బోఆలీ' (Boali) అను ఒక ఒక పర్వతమును చేరితిని, ఇది శుంఘ్రీ' కన్న చాల క్రిందుగ నుండెను. ఈ పర్వతపాదముననే “ నగరియను నదియును, చెంతనే మరియొక పర్వత పాదమునుండి ' శతద్రి ' (Sutlej) నదియును ప్రవహించు చుండెను. " బోఆలీ " పర్వత శిఖరమునుండి చూడ (శతద్రి) నది యొక గజము వెడల్పున్నట్లు గాన్పించెను; అందలి జలము సూర్యకిరణములందొక రజత పత్రమువలె తళుకుతళుకు మనుచుండెను. ఈనదీతీరమున ' ' రాంపూర్ ' అను ఒక పట్టణముండెను. దీని ప్రసిద్ధి యేమనిన, నీప్రాంతంము నందలి పర్వతములన్నిటికి నధీశుడైన రాజునకిది రాజధాని. “ రాంపూర్' ప్రతిష్టిత యైయున్న పర్వతము సమిషముననే గాన్పించుచుండెను. గాని యచటకు పోవుట కనేక నీమ్న పథముల దాటి పోవలెను. ఈ రాజు 25 వత్సరముల ప్రాయము వాడు; ఇంచుక ఆంగ్ల భాషాపరిచయ ముకూడ గలదు. “ రాంపూర్ 'నుండి, భజ్జీ రాణా (Rana of Bhajji) యొక్క రాజధానియగు ' సోహినీ' (Sohini) పట్టణముగుండా ప్రవహించి, దిగువనున్న ‘బిలాస్ పూర్ ' Bilaspur) వద్ద పర్వతములను వదలి, పంజాబులో ప్రవేశించి ప్రవహించును.


  • నల్లమందు పండించు పొలములు,