పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది ఆరవ ప్రకరణము.


మరుసటి సంవత్సరము ఆశ్వయుజమాజమాసము నందు శరత్కాల శోభ ప్రకాశించు చుండెను. తిరిగి నా మనస్సులో భ్రమణేచ్ఛ ప్రదీప్త మయ్యెను. ఈసారి సంచారమున కెచటికి పోవుటకును నేను నిశ్చయము చేసికొన లేక పోతిని. జలమార్గమున సంచరించెదనని మాత్రము నిశ్చయించుకొని నౌకను చూచుటకు గంగా తీరమునకు పోతిని. అందొక పెద్దస్టీమరు కనబడెను. దానిలోని కళాసులు వారివారి కార్యములలో నిమగ్ను లైయుండిరి. స్టీమరు త్వరలోనేబయలు దేరునట్లు కన్పటైను. ఈస్టీమరు అలహాబాదెప్పటికి చేరునని నేను ప్రశ్నించితిని. ఇక రెండు మూడు రోజులలో స్టీమరు సముదములోనికి వెళ్ళునని . నావికులు చెప్పిరి. ఇది వినిన తోడనే సముద్ర యానము నందలి యిచ్ఛ పూర్ణము గావించుకొనుట కిదియొక మంచి తరుణమని భావించితిని. వెంటనే కెప్టను' వద్దకు పోయి నేనందులో నొక గదినద్దెకు తీసికొంటిని. యధాసమయమున ఓడమీద సముద్ర యానమునకు బహిర్గతుడనైతిని, ఇంతకు పూర్వము సముద్రనీలజలము నెన్నడును చూచియుండ లేదు. తరంగాయితానంత నీలోజ్వల సముద్రమును దహో రాత్రము విచ్ఛన్న విచిత్రశోభలను వీక్షించి యనంత పురుషుని మహిమలో నిమగ్ను డనైతిని.


సముదమును ప్రవేశించి ఒక్క రాత్రంతయు తరంగములలో నూగియూగి మధ్యాహ్నము మూడుగంటలకు 'స్టీమరు' లంగరు వేసెను. మాముందొక తెల్లని యిసుక తిప్ప కనబడెను. దానిపై ఒక వస తియున్నట్లు తోచెను. ఆస్థలమును చూచుటకొక పడవమీద పోయి యుంటిని. నేనచ్చట నిటునటు తిరుగుచుండగా మెడలో రక్ష రేకు లతో కొందరు 'చిటగాంగు' (Chittagong) నివాసులగు బంగాళీలు