పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుభమస్తు

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్

స్వీయ చరిత్రము.

మొదటి ప్రకరణము.


మానాయనమ్మకు నాయందు మిక్కిలియిష్టము. శైశవమునందు నాకు సర్వమును ఆమెయే అయి ఉండెను. నిద్రించుట, కూర్చుండుట, భుజించుట, అన్నియును నేనామెవద్దనే. ఆమె ఎప్పుడు కాళీ ఘట్టమునకు పోయినను ఆమెతోగూడ నేనును పోవువాడను. నన్ను విడిచి ఆమె జగన్నాధ క్షేత్రమునకును బృందావనమునకును వెడలి నప్పుడు నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. ధర్మమునందామెకు మిక్కిలి నిష్ఠయుండెను. అనుదినమును ఆమె ఉదయముననే గంగాస్నానము చేయుచుండెడిది. ప్రతిదినమును సాలగ్రామమునకు స్వహస్తములతో పుష్పమాల గ్రుచ్చుచుండెడిది. అప్పుడప్పుడామె ఉదయాస్తమయములు సాధనలో మునిగియుండెడిది. సూర్యుడుదయించినది మొదలు అస్తమించు వరకును సూర్యునకు అర్ఘ్యప్రదానము చేయుచుండెడిది. ఆసమయములలో ‘డాబా’ మీద ఎండలో నేనును ఆమెతో నుండెడివాడను. “జబాకుసుమ సంకాశం కశ్యపేయ మహాద్యుతిః” అనుసూర్యార్ఘ్య ప్రధానమంతము వినగవినగ నాకుకూడ అభ్యాసనుయ్యెను.

ఒక్కొక్క రోజున ఆమె హరివాసరోత్సవము సల్పుచుండెడిది. అప్పుడు రాత్రి అంతయు హరికథలు భజనలు జరుగుచుండెడివి. ఆశబ్దమువల్ల నాకు నిద్రపట్టకుండెడిది.