పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
58
మహాపురుషుల జీవితములు

మఱిదేవి యను నుత్తమ బాలిక భార్యయగునట్లు విధింపఁబడిన దనియు వానియొద్దకుఁబోయి యడుగుమనియు దనవారితోఁ జెప్పెను. వారామాటల కద్భుతపడి వెంటనే ముఖోపాధ్యాయుని యొద్దకుఁ బోయి యడుగ నతఁ డంగీకరించి యైదేండ్లు వయస్సుగల తన కూఁతును వానికిచ్చి వివాహము చేసెను. వివాహ మయిన పిదప మరల రామకృష్ణుఁడు వచ్చి యాలయంబున నర్చకత్వము చేయఁ బూనెను.

వివాహము జరిగినదిగాని చుట్టము లనుకొన్నట్లు వాని మనోవైకల్యముమాత్ర మించుకయుఁ దగ్గక మఱింత హెచ్చెను. ఈపర్యాయ మతఁడు ప్రార్థనము సేయుటయె గాక యహోరాత్రము లోక్క మచ్చున నెడతెరపిలేక తల్లీ నాకుఁ బ్రత్యక్షము గావేమి యని పెద్ద పెట్టున నేడ్వసాగెను. ప్రతిదినము సాయంకాలమయిన తోడనే "అయ్యో! దల్లీ ! మరల నొకదినము గడచిపోయినది. ఇఁకఁ బ్రత్యక్ష మగుటయెన్నఁడే" యని విలపించును. చూచిన వారిలోఁ గొందఱు పిచ్చియెత్తినదనిరి. మఱికొంద ఱాయేడుపుఁ జూచి వానికి దారుణముగబాధ కలదనిరి. మధురనాథుఁడు నది రోగమే యనుకొని తగుచికిత్స చేయించుటకు గొప్పవైద్యులవద్దకుఁ దీసికొనిపోయి చూపెను. వైద్యు లెవ్వరు వానిరోగము కనుఁగొనఁ జాలరయిరి. తుదకొక మహావైద్యుఁడు వానికది రోగము కాదనియు నతఁడు మహాయోగి యనియుఁ జెప్పెను. అతఁ డొకప్పుడు భక్తిపారవశ్యముచేత దేవీకి సమర్పింపఁ దలఁచిన పూలదండలు తానే మెడలో వైచుకొనును. మధురనాథుఁడది మొట్టమొదటఁ జూచి వానిపైఁ గౌపించెను; కాని పిమ్మట వానిమహిమ నెఱిఁగి యూరకొనెను. రామకృష్ణుఁడు గుడిలో నర్చనసేయుటకు వీలులేని యవస్థలో నుండుటచే