పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
45
కేశవచంద్రసేనుఁడుయెడల జనుల కనురాగ మతిశయమై యాయనురాగము భక్తిగాఁ బరిణమించి తుదకు వానిని భగవంతుఁడని జనులు పూజించు నంత వఱకు వచ్చెను. కేశవ చంద్రునియందు జనులకాకస్మికముగఁ గలిగిన యాయమిత గౌరవము భక్తియు వాని యనుచరులకే కొందఱకు వానిపై ద్వేషమును గలిగించును. నాడు మొదలు వాని యనుచరులు రెండు కక్షలుగా నేర్పడి యొక తెగవారాతనిని భక్తిశ్రద్ధలతోఁ బూజించుటయు రెండవ తెగ వారాతను చేష్టల ననుమానించి యట్టి బూజల కనర్హుఁడని చెప్పుటయు సంభవించెను.

హిందూ దేశమున కప్పటి గవర్నరుగారగు లారెన్సు ప్రభువుగారితో కేశవచంద్రుని కప్పటి కొక్క సంవత్సరముక్రిందట పరిచయము గలిగెను. అందుచే నితఁడు మాన్ఘీరులో నుండఁగా నా ప్రభువు సిమ్లా నగరమునకు రమ్మని వానిని సన్మార్గపూర్వకముగ పిలువ నక్కడ కరిగెను. ఆ కాలమున రాజ ప్రతినిధిగారితో మాట లాడి ఇతఁడు బ్రహ్మమతస్థుల వివాహములను శాస్త్రీయములుగఁ జేయుటకొకశాసనమును నిర్మించుట యావశ్యకమని కనఁబరిచెను. గవర్నరుజనరలుగారు కేశవచంద్రుని యాలోచన మంచిదని యొప్పు కొని యట్టిశాసనము నొక దానిని నిర్మింపఁ బూనుకొనెను. తరువాత నతఁడు కలకత్తాకువచ్చి బ్రహ్మమందిర నిర్మాణమును వేవేగ ముగించి 1869 వ సంవత్సరము 7 వ ఆగష్టున తద్గృహప్రవేశోత్సవమును జేసెను.

1870 వ సంవత్సరము ఫిబ్రేవరు 15 వ తారీఖున కేశవచంద్రుఁ డింగ్లాండుదేశమునకు బ్రయాణమైపోయి 21 వ మార్చిని లండనునగరముచేరి యక్కడ నున్న లారన్సు ప్రభువుగారివలనను మఱికొందఱి వలనను సగౌరవముగ నాదరింపఁబడెను. ఆయన యేపట్టణమునకుఁ బోయిన నాపట్టణమున జనులందఱు వానినమిత గౌరవముచేసి మిక్కిలి