Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేశవచంద్రసేనుఁడు

39



దర్క వేదాంతశాస్త్రములలో గట్టికృషిచేసెను. ఇంగ్లీషుకవులలో వానికి షేక్స్పియరు, మిల్టనుకవులపై నెక్కువ యభిమానము.

చిన్న తనమునుండియు వానికి దైవప్రార్థనమువలన లాభము గలదని గట్టినమ్మకముండెను. మొదటినుండియు నితనికి క్రైస్తవమత బోధకులతోఁ బరిచయ మెక్కుడుగఁగలదు. వారి సహాయమునను దక్కిన మిత్రుల బ్రోత్సాహమునను నితఁడు 'బ్రిటిషు యిండియా సంఘ' మనుపేర నొకసమాజమును నాంగ్లేయభాషాభివృద్ధికొఱకును ప్రకృతిశాస్త్రజ్ఞాన సంపాదనకొఱకును స్థాపించెను. ఇదిగాక జ్ఞానాభివృద్ధి కొఱకు యింక నెన్నియో సమాజములను సంఘములను స్థాపించెను. 1855 వ సంవత్సరమునఁ జంద్రసేనుఁడు సాయంకాల పాఠశాల నేర్పరచి యక్కడకు వచ్చువారికి నీతులుగూర్చియు మతముంగూర్చియు నింగ్లీషుభాషలోని గొప్పగొప్ప సంగతులు గూర్చియు నుపన్యసించుచువచ్చెను. అతనికి షేక్స్పియరు వ్రాసిన నాటకములపైఁగల యభిమానముచే వానిం బ్రయోగించునిమిత్త మొక నాటకసంఘ మేర్పరచి వానిలోఁ దానుగూడ నుత్తమ పాత్రలఁ గయికొని జనరంజకముగ నభినయించెనని చెప్పుదురు. సాయంకాల పాఠశాల మూడునాలుగేండ్లలో నంతరించఁగాఁ గేశవుఁడు వేదాంత చర్చలు సలిపి ప్రార్థనాదికములు సలుపుటకు 'పరస్పర భ్రాతృభావసమాజము' (GOOD WILL FRATERNITY) నేర్పరచెను. ఆసమాజమునఁ బలుమారు కేశవుఁడు పరమేశ్వరుఁడు మన కెల్లరకుఁ దండ్రియనియు మనుజులందఱు సోదరులనియు నింగ్లీషున బోధించుచు వచ్చెను. ఆసంవత్సరమందే కేశవచంద్రసేనుఁడు బ్రహ్మసమాజ మతమందుఁ జేరి తత్ప్రతిజ్ఞాపత్రికలమీఁద సంతకముఁ జేసెను. అందుతాను జేరిన విషయమునుగూర్చి యతఁడిట్లు వ్రాసియున్నాఁడు.