పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

మహాపురుషుల జీవితములు



కేశవచంద్రసేనుఁడు చిన్న తనమున నన్నియు మంచివస్తువులె కావలయు నని కోరి మంచిబట్టలు మంచిపెట్టెలు పుచ్చుకొని యవి యెవ్వరు ముట్టుకొనకుండ జాగ్రత్త పెట్టుకొనుచుండువాడు. అతఁడు స్వభావముచేతనే శాంతుఁడును సాధువునై దుశ్శీలము లేక చులకనగఁ గోపము దెచ్చుకొనక సౌమ్యుఁడయి యుండెను. కొంత కాలమింటివద్ద స్వభాష నేర్చుకొనినపిదప పదునొకండేండ్లప్రాయమున వానినింగ్లీషువిద్యనిమిత్తము హిందూకళాశాలకుఁ బంపిరి. విద్యార్థిగా నున్నపు డతఁడు మిక్కిలిపాటుపడుచు ప్రతి సంవత్సర పరీక్షాంతమున నొకటి రెండు బహుమానముల నందుకొనుచు 1850 సంవత్సరమునఁ బరీక్షలోఁ గృతకృత్యుఁడయి పెద్దగణితశాస్త్రగ్రంథము నొక దానిని బహుమానముగ బడసెను. అప్పటినుండియు వాని నెఱిఁగినవారు పెద్ద పుస్తకమును బుచ్చుకొన్న చిన్న పిల్ల వాఁడని చెప్పుకొనుచు వచ్చిరి. చిన్ననాఁట నితనియందుఁ బొడగట్టినబుద్ధిసూక్ష్మతను బరిశ్రమను సౌజన్యమును జూచి యితఁడు గొప్ప పరీక్షలం దేరు నని యొజ్జలు తలంచిరి; కాని వారికోరికలు కొనసాగినవికావు. ఏలయన 1852 వ సంవత్సరమున హిందూకళాశాలాధికారులకును దత్పోషకులకును వివాదములు పొడమినందున వేరొకకళాశాల యచ్చట స్థాపింపఁబడగాఁ గేశవచంద్రు డానూతనపాఠశాలకుఁ బోయి యా వఱకుఁ జదువుకొన్న దానికంటె పైతరగతిలోఁ జేరెను. రెండేండ్లలో నీక్రొత్తకళాశాలయెత్తి వేయఁ బడగాఁ గేశవుఁడు మరల హిందూకళాశాలకేవచ్చి చేరెను. ఈ మార్పులవలన విద్యాభంగము గలుగుటచే నతఁడటుమీఁదఁబెద్దపరీక్షలలోఁ దేఱఁజాలడయ్యె, అయినను తత్కళాశాలలో 1858 వ సంవత్సరమువఱకు నతడు విద్యాభ్యాసముచేసి చివర రెండేండ్లలోఁ