పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కేశవచంద్ర సేనుడు

కేశవచంద్రసేనుఁడు 1838 వ సంవత్సరమున నవంబరు 19 వ తారీఖునఁ గలకత్తా నగరమున జన్మించెను. అతనిపూర్వులు హుగ్లీ నదీతీరమున నున్న గరీఫాగ్రామమున వసియించెడివారు. ఈకుటుంబమువారు పూర్వము బంగాళమును బాలించిన సేనరాజుల సంతతిలోఁ చేరినవైద్యకులస్థులు ఈతనితాత యగు రామకమలసేనుఁడు స్వగ్రామమును విడిచి కలకత్తాకు వచ్చి మొదట నొకయచ్చుకూటములో నెనిమిదిరూకలు జీతముగల చిన్న యుద్యోగములోఁ జేరి క్రమక్రమమున తనబుద్దికుశలతచేతను స్వయంకృషి చేతను బాగుపడి నెలకు రెండువేలరూకలు జీతముగల బ్యాంకు దివానుపనిచేసి సుప్రసిద్ధుడై బంగాళా దేశమునం దంతటదనకుటుంబమునకు మహాఖ్యాతిఁదెచ్చెను. అతఁడు విద్యావిశారదుఁడయి యింగ్లీషు బంగాళి నిఘంటువు నొక దాని నొనరించి స్వభాషకు మహోపకారముఁ జేసెను. ఆయనకు నలుగురు కొడుకులుండిరి. వారిలో పేరీమోహనుడు రెండవ యతఁడు.

ఆ పేరీమోహనుఁడు కలకత్తా టంకశాలలోఁ కొంతకాలము దివానుగాఁబనిజేసి తనతండ్రి గతించినమూడేండ్లకు (అనగా 1848 వ సంవత్సరమున) కాలధర్మము నొందెను. ఆయన ముప్పదినాలుగేండ్ల చిన్న ప్రాయముననే మృతినొందినను జనులచే మంచివాఁడనుచు నెన్నఁబడుచువచ్చెను, మొత్తముమీఁద తనస్వప్రసిద్ధికన్న రామకమల సేనుని కొడుకగుట చేతను కేశవచంద్రసేనుని తండ్రి యగుట చేతను నధిక ప్రసిద్ధివచ్చెను. ఆయనకుమారులుముగ్గురిలో కేశవచంద్రసేనుఁడు మధ్యముఁడయి తండ్రిపోవునప్పటికి పదియేండ్లప్రాయము గలిగియుండెను. తండ్రిబాల్యమున గతించినను వానియదృష్టవశమునఁ దల్లి మిక్కిలి తెలివిగలదగుటచే నెక్కుడు జాగరూకతతో వానింబెంచెను.